కాల్చేసే కాంతిపుంజం!  | Israels Iron Beam Laser and How Does it Work | Sakshi
Sakshi News home page

కాల్చేసే కాంతిపుంజం! 

Published Sun, Feb 11 2024 7:51 PM | Last Updated on Sun, Feb 11 2024 7:51 PM

Israels Iron Beam Laser and How Does it Work - Sakshi

లెబనాన్ మీద ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమవుతోందా? పక్కలో బల్లెంలా మారిన హెజ్బుల్లాను సమూలంగా తుడిచిపెట్టాలని అది లక్ష్యంగా నిర్ణయించుకుందా? అలాంటి సమరమే అనివార్యమైన పక్షంలో హెజ్బుల్లా ఉగ్రవాదుల డ్రోన్లు, రాకెట్లను కూల్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అగ్గిబరాటా ‘ఐరన్ బీమ్’ తొలిసారిగా రంగప్రవేశం చేయబోతోందా? గాజాలో మాదిరి పాత పద్ధతుల్లో పోరాడితే మిగిలేది వృథాప్రయాసే కనుక యూదులు ఈసారి కొత్తగా కదం తొక్కనున్నారా? హెజ్బుల్లాతో యుద్ధం ఆరంభమయ్యే పక్షంలో ఇజ్రాయెల్ ప్రజలకు కొన్ని రోజులపాటు విద్యుత్ సంక్షోభం తప్పదని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికార వర్గాలకు సూచిస్తున్న హెచ్చరికల పత్రం ఒకటి ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖలో రౌండ్లు కొడుతున్నట్టు ‘ద జెరూసలెం పోస్ట్’ పత్రిక ఓ కథనం ప్రచురించింది. 

హెజ్బుల్లాతో యుద్ధం మొదలైతే ఇజ్రాయెల్ జనాభాలో కనీసం 60% మంది ఒకట్రెండు రోజులపాటు విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కోవాల్సొస్తుందని, కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులపాటు విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చని, ప్రజలు తగినంత ఆహారం, నీరు, బ్యాటరీ సహా రేడియో రిసీవర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గర ఉంచుకోవాలని ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీ అథారిటీ మరోవైపు హెచ్చరిక చేసింది. ఇదంతా చూస్తుంటే ‘ఐరన్ బీమ్’ లేజర్ ఆయుధాలను ప్రయోగించడానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 

ప్రపంచంలోనే తొలిసారి!  
‘ఐరన్ బీమ్’… ఉగ్రవాదుల రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేసి వాటిని క్షణాల్లో కాల్చి బూడిదగా మార్చే ఓ అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. తీవ్రమైన కాంతిపుంజపు ఉష్ణశక్తితో కూడిన ఈ వినూత్న సాంకేతిక ఆయుధాల గురించి ఇప్పటివరకు వినడమే తప్ప ఇంకా ఏ దేశమూ ప్రయోగించలేదు. మరింత చెప్పాలంటే ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్న టెక్నాలజీ ఇది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇజ్రాయెల్ రఫేల్ అడ్వాన్సుడ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. స్టార్ ట్రెక్, స్టార్ వార్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ఆయుధాల తరహాలో ఇది ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ‘

డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్’గా వ్యవహరించే ఈ కొంగొత్త వ్యవస్థను 2014 ఫిబ్రవరి 11న సింగపూర్ ఎయిర్ షో సందర్భంగా ప్రదర్శించారు. పాలస్తీనీ హమాస్, లెబనీస్ హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థలతో తాజా ఘర్షణలు, కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ‘ఐరన్ బీమ్’ను మోహరించబోతోందని తెలుస్తోంది. యారో-2, యారో-3, డేవిడ్స్ స్లింగ్, ఐరన్ డోమ్ తర్వాత ఆ దేశ అమ్ములపొదిలో చేరబోతున్న సరికొత్త ఆగ్నేయాస్త్రం ఈ ‘ఐరన్ బీమ్’. ఫైబర్ లేజర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ‘ఐరన్ డోమ్’తో పోలిస్తే ‘ఐరన్ బీమ్’ చిన్నది, తేలికైనది. రహస్యంగా ప్రయోగించడానికి, ఒక చోట నుంచి మరో చోటకు తరలించడానికి మరింత అనువైనది. ‘ఐరన్ డోమ్’ కూడా ఇజ్రాయెల్ స్వల్పశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థే. కానీ అది ఇటీవలి హమాస్ రాకెట్ దాడులను సమర్థంగా నిలువరించడంలో విఫలమైంది. అందుకే ఇప్పుడు ‘డోమ్’కు ‘బీమ్’ను జతచేసి సత్ఫలితాలు రాబట్టాలని ఇజ్రాయెల్ వ్యూహం పన్నుతోంది. ‘ఐరన్ బీమ్’కు పరిమితులు లేకపోలేదు. 

తడి వాతావరణ పరిస్థితుల్లో ఈ లేజర్ ఆయుధ వ్యవస్థ పనిచేయదు. ఎంతటి సానుకూల పరిస్థితులున్నా వాతావరణంలోని తేమ వల్ల 30% నుంచి 40% వరకు శక్తిని లేజర్ కోల్పోతుంది. అలాగే ధ్వంసం చేయాల్సిన లక్ష్యం... ‘ఐరన్ బీమ్’ దృష్టిరేఖకు సూటిగా ఉండాలి. అంటే... నేరుగా కంటికి కనిపించకుండా, ‘ఐరన్ బీమ్’కు సరళరేఖాత్మకంగా కాకుండా... లక్ష్యం ఎక్కడో నక్కి ఉంటే దాన్ని లేజర్ కిరణాలతో నాశనం చేయడం సాధ్యం కాదు. ‘ఐరన్ బీమ్’ ఫైరింగ్ రేటు కూడా తక్కువ. లక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి సరిపోయేంత లేజర్ శక్తిని ప్రయోగించాలంటే కనీసం 5 సెకన్లు, అంతకు పైబడిన సమయం అవసరం. 

అయినప్పటికీ... శత్రు క్షిపణులను గగనతలంలోనే అడ్డుకుని కూల్చివేసే సంప్రదాయ ఇంటెర్సెప్టర్ క్షిపణులతో పోల్చితే ‘ఐరన్ బీమ్’ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైనది. ఖర్చు తక్కువ, పనితీరు ఎక్కువ... ఈ సిస్టమ్ సూత్రం. ఇందులో షాట్స్ పరిమితి ఉండదు. ఎన్నిసార్లైనా పేల్చవచ్చు. ‘ఒక్కో షాట్’కు అయ్యే వ్యయం తక్కువ. అలా నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి. దీనికి భిన్నంగా ‘ఐరన్ డోమ్’ వ్యవస్థలో ఒక్కో ఇంటెర్సెప్టర్ రాకెట్ కోసం 50 వేల నుంచి 60 వేల డాలర్ల వరకు ఖర్చవుతోంది. ఈ వ్యయం తడిసి మోపెడవుతోంది. ‘ఐరన్ బీమ్’కు అయ్యే ఖర్చు కొన్ని డాలర్లు మాత్రమే. ఈ వ్యవస్థలో శత్రు క్షిపణని ఢీకొట్టాక ‘రక్షిత ప్రదేశాల్లో’ పడే ఇంటెర్సెప్టర్ శకలాల ముప్పు కూడా ఉండదు. ‘ఐరన్ బీమ్’ రేంజిని పరిశీలిస్తే... 7 కిలోమీటర్ల పరిధిలోని క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు (UAVs), మోటార్ షెల్స్ వంటి వాటిని క్షణాల వ్యవధిలోనే అది నిర్వీర్యం చేయగలదు. ఈ వ్యవస్థలో వాడే ‘డైరెక్ట్ ఎనర్జీ’ స్థాయిని 2023 సంవత్సరం చివరి నాటికి 100 కిలోవాట్లకు పెంచాలనే ప్రతిపాదనలు వచ్చాయి. వాస్తవానికి 2025 నాటికి ‘ఐరన్ బీమ్’ను మోహరించాలని ఇజ్రాయెల్ భావించింది. కానీ యుద్ధం నేపథ్యంలో రక్షణ అవసరాలు ఆ ప్లాన్ అమలు కాలాన్ని వేగిరపర్చాయి. 

ఐరన్ బీమ్ Vs లైట్ బీమ్! 
రఫేల్ సంస్థ రెండు హై ఎనర్జీ లేజర్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. అవి ‘ఐరన్ బీమ్’, లైట్ బీమ్. ‘లైట్ బీమ్’ అనేది 7.5 కిలోవాట్ల ఇంటెర్సెప్టర్.  రెండు కిలోమీటర్ల దూరంలోని చిన్నపాటి మానవరహిత వైమానిక వాహనాలు, నేలమీది ఐఈడీలు (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్), పేలని మందుగుండు తదితర లక్ష్యాల్ని ‘లైట్ బీమ్’ తటస్థం/నిర్వీర్యం చేయగలదు. ఇక ‘ఐరన్ బీమ్’… 100 కిలోవాట్ల తరగతికి చెందిన హై ఎనర్జీ లేజర్ సిస్టమ్. రాకెట్లు, శతఘ్నులు, యూఎవీలను కూల్చగలదు. 
- జమ్ముల శ్రీకాంత్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement