చెట్టులెక్కగలవా? ఓ నరహరి పుట్టలెక్కగలవా?
చెట్టులెక్కి.. ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా?
అప్పుడెప్పుడో లక్ష్మీదేవి పెట్టిన వర పరీక్ష ఇది!
ఇప్పుడా అవసరం మనిషికి లేదు కానీ.. అన్ని రంగాల్లోకీ దూసుకొస్తున్న యంత్రులకు అదేనండి రోబోలకు కావాలి. ఎందుకంటే.. చెట్టూ పుట్ట ఎక్కే రోబోలను మరిన్ని ఎక్కువ చోట్ల వాడుకోవచ్చు మరి. ఇప్పటివరకూ తయారైన రోబోలు కొంచెం తడబడుతూ మెట్లు ఎక్కగలిగేవి కానీ.. స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జూరిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ‘ఎనిమల్’ మాత్రం చాలా వేగంగా నాలుగు కాళ్లతో నిచ్చెన మెట్లు ఎక్కేయగలదు. రెండు కాళ్లపై నుంచోవడం, అడ్డ కూలీల్లా బాక్స్‌లను దూరంగా విసిరివేయడం, ఎక్కినంత వేగంగా మెట్లు దిగగలగడం వంటి పనులన్నీ ఠకీ మని చేసేయగలదీ రోబో. ఏడేళ్ల క్రితం ఈ సంస్థ స్కైస్కాపర్లలో ఎలివేటర్లను వాడుకునే శక్తిగల రోబోలను తయారు చేసింది. అప్పటి నుంచి ఇది ఎనీబోటిక్స్ అనే సంస్థ ద్వారా వాణిజ్యస్థాయిలో అందుబాటులో ఉంది కూడా. తాజాగా ఈ సంస్థే ‘ఎనిమల్’ను అభివృద్ధి చేసింది.
ఎనిమల్ నిమిషానికి 0.75 మీటర్ల వేగంతో నడవగలదు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎత్తుపల్లాలతో సంబంధం లేకుండా గంటన్నర నుంచి రెండు గంటల పాట పనిచేస్తుంది. ఇంటా బయట ఎక్కడైనా సరే.. అడ్డంకులను తప్పించుకుని ప్రయాణించగలదు. చుట్టూ జరుగుతున్న విషయాలను చూసి అర్థం చేసుకునేందుకు వీలుగా ఇందులో 360 డిగ్రీ లైడర్ మాడ్యూల్, లోతును అంచనా కట్టేంఉదకు ఆరు సెన్సింగ్ కెమెరాలు, చూపునకు రెండు కెమెరాలు ఉన్నాయి. ఈ సెన్సర్లు, కెమెరాలిచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు అర్థం చేసుకునేందుకు ఇంటెల్-6 కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
కొక్కేల్లాంటి కాళ్లు...
మెట్లు ఎక్కే ప్రత్యేకమైన శక్తి కోసం ‘ఎనిమల్’ నాలుగు కాళ్లకు కొక్కేల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి. ‘సి’ ఆకారంలో ఉండే ఈ నిర్మాణాలు నిచ్చెన మెట్లను గట్టిగా పట్టుకునేందుకు, అవసరమైనప్పుడు వదిలేసేందుకు ఉపయోగపడతాయి. కాళ్లు, చేతులతో పైకి ఎక్కేందుకు మన మాదిరి ప్రయత్నిస్తుందన్నమాట. కంప్యూటర్ మోడళ్ల సాయంతో ఈ కొక్కేలను ఎలా వాడాలో ఎనిమల్‌కు నేర్పించారు శాస్త్రవేత్తలు. పరిశోధనశాల ప్రయోగాల్లో ఈ రోబో 70 నుంచి 90 డిగ్రీల కోణమున్న నిచ్చెనలను కూడా 90 శాతం కచ్చితత్వంతో ఎక్కగలిగింది. మరీ ముఖ్యమమైన విషయం ఏమిటంటే... ఇలా మెట్లు ఎక్కగల రోబోలతో పోలిస్తే దీని వేగం 232 రెట్లు ఎక్కువ! నమ్మడం లేదా.. వీడియో చూసేయండి మరి...
Comments
Please login to add a commentAdd a comment