తాలిబాన్‌ అధీనంలోకి మరో ప్రావిన్స్‌ రాజధాని! | Lawmaker says Taliban enter north Afghan provincial capital | Sakshi
Sakshi News home page

తాలిబాన్‌ అధీనంలోకి మరో ప్రావిన్స్‌ రాజధాని!

Published Sun, Aug 8 2021 5:23 AM | Last Updated on Sun, Aug 8 2021 5:23 AM

Lawmaker says Taliban enter north Afghan provincial capital  - Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ భూభాగంపై తాలిబాన్‌ ఆధిపత్యం రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. నైరుతి అఫాŠగ్న్‌లోని నిమ్రోజ్‌ ప్రావిన్స్‌ రాజధాని జరాంజ్‌ను ఆక్రమించుకున్న మరుసటి రోజే మరో ప్రావిన్స్‌ రాజధానిపై తాలిబన్‌ కన్నుపడింది. ఉత్తర అఫాŠగ్‌న్‌లోని జావ్‌జాన్‌ ప్రావిన్స్‌ రాజధాని నగరం షెబెర్‌ఘన్‌లోకి తాలిబాన్‌ సాయుధమూకలు అడుగుపెట్టాయని అఫ్గానిస్తాన్‌ చట్టసభ్యుడు మొహమ్మద్‌ కరీమ్‌ వెల్లడించారు. నగరంలోకి ప్రవేశించిన తాలిబాన్‌ మూకలు అక్కడి సిటీ జైలులోని ఖైదీలకు విముక్తి కల్పించాయని స్థానికులు చెప్పారు.

కరీమ్‌ వాదనను అఫ్గాన్‌ ప్రభుత్వం తోసిపుచ్చకపోవడం గమనార్హం. షెబెర్‌ఘన్‌పై అఫ్గాన్‌ సైన్యందే పైచేయి అని మాత్రం ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఈ ప్రావిన్స్‌లోని 10 జిల్లాల్లో ఏకంగా తొమ్మిదింటిని తాలిబాన్‌ హస్తగతం చేసుకుంది. 34 ప్రావిన్సుల రాజధానులకూ తాలిబాన్‌ ముప్పు పొంచి ఉందనే వార్త అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. శుక్రవారమే జరాంజ్‌ను ఆక్రమించుకున్నామని తాలిబాన్‌ ప్రకటించుకోగా రాజధానిలో తమ సైన్యం పోరాడుతోందని ప్రభుత్వం చెబుతోంది. షెబెర్‌ఘన్‌ రాజధాని వ్యూహాత్మకంగా అఫ్గాన్‌కు కీలకమైనది.

ఇక్కడ రషీద్‌ దోస్తుమ్‌ నేతృత్వంలోని సాయుధ బలగాలు గతంలో అమెరికా సంకీర్ణ సేనలతో కలసి తాలిబాన్‌కు వ్యతిరేకంగా పోరాడాయి. అఫ్గాన్‌ నుంచి అమెరికా సేనల నిష్క్రమణ ప్రక్రియ 95 శాతం పూర్తయిందని, ఈ నెల 31 నాటికి వైదొలగడం ముగుస్తుందని అమెరికా కేంద్ర విభాగం స్పష్టంచేయడం తెల్సిందే. దక్షిణ హెల్మండ్, కాందహార్‌ ప్రావిన్స్‌లలో తాలిబాన్‌ లక్ష్యాలపై వైమానిక దాడులు చేయడంలో అఫ్గాన్‌ సేనలకు అమెరికా సాయపడుతూనే ఉంది. పరిస్థితులు చేయిదాటుతున్న నేపథ్యంలో తమ దేశ పౌరులు తక్షణం అఫ్గాన్‌ను వదిలి వెనక్కి రావాలని కాబూల్‌లోని అమెరికా, బ్రిటన్‌  శనివారం హెచ్చరికలు జారీచేశాయి. 421 జిల్లాలున్న అఫ్గాన్‌లో సగానికిపైగా జిల్లాలు తాలిబాన్‌ మూకల అధీనంలోకి వెళ్లిపోయాయని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement