ట్రంప్‌ అమెరికాను చైనాకు అమ్మేశారు : హారిస్‌ | Live Updates: Kamala Harris and Donald Trump Presidential Debate | Sakshi
Sakshi News home page

తొలి డిబేట్‌: ట్రంప్‌- హారిస్‌ల మధ్య మాటల యుద్ధం

Published Wed, Sep 11 2024 6:56 AM | Last Updated on Mon, Oct 7 2024 10:38 AM

Live Updates: Kamala Harris and Donald Trump Presidential Debate

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య తొలి ప్రత్యక్ష డిబేట్‌ జరిగింది. ఈ డిబేట్‌లో అమెరికా ఆర్థిక వ్యవస్థ, గర్భవిచ్ఛిత్తి అంశం, ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధం,ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది. డిబెట్‌లో ట్రంప్‌-హారిస్‌ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. అధ్యక్షుడిగా ట్రంప్‌ పాలనలో జరిగి తప్పిదాలను ప్రధాన అంశంగా చర్చిస్తూ హారిస్‌ పైచేయి సాధించారు. 

డిబెట్‌లో ఏబీసీ న్యూస్‌ యాంకర్లు డేవిడ్‌ ముయిర్‌,లిన్సే డేవిస్‌..ఆర్థిక వ్యవస్థ, కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలంటూ హారిస్‌ను ప్రశ్నించారు.  

అందుకు హారిస్‌ ముందుగా పేదరికం గురించి మాట్లాడారు. తనని అమెరికా అధ్యక్షురాలిగా గెలిస్తే.. పేదరికంపై దృష్టిసారిస్తామని చెప్పారు. చిరు వ్యాపారాల్ని ప్రోత్సహిస్తామన్నారు. చిరు వ్యాపారం చేసే వారికి అండగా నిలుస్తాం. అందుకు వద్ద ప్రణాళికలు ఉన్నాయి’అని వాటి గురించి వివరించారు. 

అదే సమయంలో హారిస్‌..ట్రంప్‌ను టార్గెట్‌ చేశారు. ఒకానొక దశలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ఘోర తప్పిదాల్ని ప్రాస్తావిస్తూ ట్రంప్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. మేం పేదలకు అండగా ఉంటే ట్రంప్‌ మాత్రం ధనికులకు, కార్పొరేట్‌ కంపెనీలకు అండగా నిలుస్తారు. ట్యాక్స్‌ కూడా తగ్గిస్తారు’ అని మండిపడ్డారు.

అమెరికాను చైనాకి అమ్మేశారు : హారిస్‌
అమెరికాను నెంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం. తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌ దేశాన్ని సమస్యల్లో వదిలేశారు. ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీశారు. దేశాన్ని చైనాకు అమ్మేశారు. ఇప్పటికే ట్రంప్‌ చేసిన తప్పుల్ని బైడెన్‌ నేనూ సరిచేశాం. అలాంటి ట్రంప్‌ మళ్లీ ఎన్నికైతే అమెరికాకు చిక్కులు తప్పువంటూ హారిస్‌ హెచ్చరించారు.

జోబైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ట్రంప్‌ నాశనం చేసిన ఆర్ధిక వ్యవస్థ  తిరిగి గాడిలోకి పెట్టామంటూ నాటి ఆర్థిక పరిస్థితుల్ని ప్రస్తావించగా..డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాంటి ప్రణాళికలు లేవన​న్నారు. 

ట్రంప్‌ ఏం మారలేదు 
ఆ తర్వాత ట్రంప్‌ సైతం కమలా హారిస్‌కు ధీటుగా బదులిచ్చారు. జోబైడెన్‌ ప్రభుత్వంలో రికార్డ్‌ స్థాయిలో పెరిగాయంటూ వ్యాఖ్యానిస్తుండగా.. హారిస్‌ అడ్డుతగిలారు. చూశారా? ట్రంప్‌ ఏం మారలేదు. అవే అబద్ధాలు. అవే మోసాలు. చెప్పిన అబద్దాల్ని పదే పదే చెబుతున్నారు. ప్రజల అంచనాలకు తగ్గట్లుగా వాదనల్ని వినిపించాలి. అలా కాకుండా ప్రజల్ని మోసం చేసేలా అవే పాత వ్యూహాలు, అబద్దాలు చెప్పడం.. ట్రంప్‌ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రతిబింబిస్తున్నాయి.

గర్భవిచ్ఛిత్తిపై.. 
ఇటీవలి కాలంలో అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గర్భవిచ్ఛిత్ (అబార్షన్‌)సహా పలు అంశాలు చర్చకు వచ్చాయి. డిబేట్‌ జరిగే సమయంలో ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. అమెరికాలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధాన్ని హారిస్‌ తప్పుబట్టారు. ఆ ప్రక్రియను అనుమతిస్తూ ‘రో వర్సెస్‌ వేడ్‌’ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. మహిళల అభివృద్ధి ట్రంప్‌నకు గిట్టదు. అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారు. ఇది మహిళలను అవమానించడమే’ అని హారిస్‌ అన్నారు.

ఇదీ చదవండి : బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సం

ఇజ్రాయెల్‌కే మా మద్దతు
డిబేట్‌లో గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధంపై హారిస్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేయగా.. ఆమె అధ్యక్షురాలిగా ఉంటే సాధ్యం కాదంటూ ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. హారిస్‌ ఇజ్రాయెల్‌తో పాటు అరబ్‌లను ద్వేషిస్తున్నారు’ అని అన్నారు. అందుకు హారిస్‌ కలగజేసుకుని.. ట్రంప్‌ చేస్తున్న వాదనలు నిజం కాదు. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.  

మీ మద్దతు ఎవరికి 
ఉక్రెయిన్ యుద్ధంపై హారిస్‌ స్పందిస్తూ.. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నట్లైతే రష్యా అధ్యక్షుడు పుతిన్‌  ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఉండేవారు. పుతిన్‌ కీవ్‌లో కూర్చుని పోలాండ్‌తో ప్రారంభించి యూరప్‌లోని మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారిస్తూ ఉండేవారు అని అన్నారు. యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్‌ విజయ సాధించాలని కోరుకుంటున్నారా? అని డిబేట్‌లో ట్రంప్‌ను ఏబీసీ యాంకర్లు ప్రశ్నించారు. అందుకు ట్రంప్‌ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు కమలాహారిస్ , డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి టీవీ డిబేట్‌ అమెరికా వార్తాసంస్థ ఏబీసీ న్యూస్‌ ఫిలడెల్ఫియాలోని నేషనల్‌ కాన్‌స్టిట్యూషన్‌ సెంటర్‌లో నిర్వహించింది. అమెరికా కాలమాన ప్రకారం రాత్రి 9.00 గంటలకు ప్రారంభం కాగా.. భారత్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 6.30 గం‍టల సమయంలో ప్రారంభమైంది. 

ఇక డిబెట్‌ జరిగే న్యూస్‌ స్టూడియోలో ప్రేక్షకులు ఎవ్వరూ లేదు. ఏబీసీ న్యూస్‌ యాంకర్లు డేవిడ్‌ ముయిర్, లిన్సే డేవిస్‌ చర్చకు కోఆర్డినేటర్లుగా ఉన్నారు.  90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్‌లో రెండు సార్లు స్వల్ప విరామం ఇచ్చారు.  డిబేట్‌ చివరలో చెరో రెండు నిమిషాలు ముగింపు ప్రసంగం చేసేందుకు అనుమతిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement