
లాస్ ఏంజిల్స్: కదులుతున్న విమానం నుంచి ఓ ప్రయాణికుడు కిందకు దూకేసిన ఘటన లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. వివరాలు.. సాల్ట్ లేక్ సిటీకు వెళ్లాల్సిన యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ విమానం 5365ను స్కై వెస్ట్ నిర్వహిస్తోంది. కాగా సాయంత్రం 7 గంటల తర్వాత డోర్ తీసేందుకు ప్రయత్నించిన యువకుడు విమానంలో నుంచి బయటకు దూకేశాడు.
అంతకముందు పైలట్‌లు ఉన్న కాక్‌పిట్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.ఆ తర్వాత సర్వీస్ డోర్ ఓపెన్ చేయాలనుకోగా.. చివరికి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావడంతో అక్కడినుంచి దూకేశాడు. ఇది గమనించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకుని ట్యాక్సీవేలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో విమానం టేకాఫ్ తీసుకొని మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. అతను విమానం నుంచి దూకేయడం వెనుక ఉన్న కారణాలు తెలియరాలేదు. కాగా ఈ ఘటనపై ఎఫ్‌బీఐ విచారణ చేయనుంది.