
లండన్: వీధులు ఊడ్చే వ్యక్తికి ఓ మల్టిమిలియనీర్ ఏకంగా రూ.1.9 కోట్లు ఇచ్చాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత తన డబ్బులు ఇవ్వాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. కోర్టులో కేసు గెలిచి తన సొమ్మును తిరిగి తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ నిరుపేద వ్యక్తికి అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు. తిరిగి చెల్లించమనేందుకు గల కారణాలేంటి.. అసలు ఏం జరిగింది?
బ్రిటన్‌కు చెందిన జాన్ రాంకిన్ కార్న్‌ఫోర్త్ అనే వ్యక్తి.. 1979లో ఓ న్యూఇయర్ పార్టీలో సిమోన్ డెనియర్ అనే వ్యక్తిని కలిశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన డెనియర్ వీధులు ఊడ్చుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జాన్ రాంకిన్.. డెనియర్ కలిసి పలు మార్లు మద్యం సేవించేవారు. ఇలా వారి మధ్య స్నేహం ఏర‍్పడింది.
కొన్ని రోజుల తర్వాత.. తన తండ్రి మరణానంతరం కొన్ని మిలియన్ల పౌండ్లు పొందారు జాన్ రాంకిన్. అందులోంచి సుమారు 2 లక్షల పౌండ్లను తన నిరుపేద స్నేహితుడైన సిమోన్ డెనియర్‌కు 2012 నుంచి 2014 మధ్య మూడు దఫాలుగా ఇచ్చారు. డెనియర్ విడాకుల ఖర్చు కోసం 2012లో 26,300 పౌండ్లు, భార్యకు భరణం ఇచ్చేందుకు 2013లో 50వేల పౌండ్లు, ఇంటి రుణం చెల్లించేందుకని 2014లో 1.25 లక్షల పౌండ్లు ఇచ్చారు జాన్ రాంకిన్.
తిరిగి చెల్లిస్తాడనుకున్నా..
ఎన్ని రోజులైన తన సొమ్మును తిరిగి చెల్లించకపోవటంతో కోర్టు మెట్లు ఎక్కారు జాన్ రాంకిన్. తన స్నేహితుడు ఆర్థికంగా ఎదిగాక తన సొమ్మును తిరిగి చెల్లిస్తాడని భావించానని చెప్పారు. కానీ అలా జరగలేదన్నారు. 2 లక్షల పౌండ్లు అనేది తనకు అంత పెద్ద సొమ్ము కాదని కోర్టు చెప్పినట్లు జాన్ రాంకిన్ గుర్తు చేసుకున్నారు. కానీ తన స్నేహితుడు తిరిగి ఇస్తాడని నమ్మానని పేర్కొన్నారు. అందుకే కోర్టు సాయం కోరినట్టు తెలిపారు.
మరోవైపు.. ఇంటి రుణం తీర్చేందుకని ఇచ్చిన 1.25 లక్షల పౌండ్లు తన స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చాడని చెప్పాడు డెనియర్. తన మాజీ భార్యకు భరణం ఇచ్చేందుకు తీసుకున్న డబ్బులు రుణంగానే తీసుకున్నానని, వాటిని తిరిగి చెల్లించానని సిటీ కౌంటీ కోర్టులో ఒప్పుకున్నాడు. "వీధులు ఊడ్చుకుంటూ జీవనం సాగించే డెనియర్‌కు ఆ డబ్బు పెద్ద మొత్తం. ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు" అని డెనియర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి స్టిఫెన్ హెల్‌మ్యాన్.. ఇంటి కోసం ఇచ్చిన 1.25 లక్షల పౌండ్లు సైతం రుణమేనని, తిరిగి చెల్లించాల్సిందేనిని తీర్పు ఇచ్చారు. కానుకగా ఇచ్చాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇంటి రుణంతో పాటు దానికి వడ్డీ చెల్లించాలని, అయితే.. విడాకుల కోసం ఇచ్చిన వాటికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment