కమల ప్రెసిడెంట్ కావడానికి వీల్లేదు
కన్జర్వేటివ్ సంస్థ పిడివాదం
కొట్టిపారేస్తున్న నిపుణులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అమెరికాలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతున్న వేళ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ అనర్హురాలంటూ సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. దీంతో, ఈసారి అధ్యక్ష ఎన్నికల మరింత రసవత్తరంగా మారింది.
కాగా, యూఎస్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రిపబ్లికన్ అసెంబ్లీస్ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) అనే సంస్థ కమలా హారిస్ అనర్హురాలంటూ సరికొత్త వాదనను ప్రచారంలో పెట్టింది. ‘సహజ పౌరసత్వం’ ఉన్నవాళ్లు మాత్రమే అధ్యక్ష పదవికి అర్హులని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నది దాని వాదన. ‘అమెరికా పౌరసత్వం ఉన్న దంపతులకు ఈ గడ్డపై పుట్టినవాళ్లను మాత్రమే సహజ పౌరులుగా రాజ్యంగం నిర్వచిస్తోంది. 1857 నాటి ప్రఖ్యాత డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్‌ఫర్ కేసులో అమెరికా సుప్రీంకోర్టు తీర్పు కూడా దీన్ని ధృవీకరిస్తోంది. ఈ నిర్వచనం ప్రకారం హారిస్‌తో పాటు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటివాళ్లు కూడా అధ్యక్ష పదవికి అనర్హులే’ అని ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ చెప్పుకొచ్చింది. ఈ కీలక మౌలిక ప్రాతిపదికను తుంగలో తొక్కుతూ డెమోక్రటిక్ పార్టీ హారిస్‌కు అధ్యక్ష అభ్యర్థిత్వం కట్టబెట్టిందని ఆరోపించింది.
మరోవైపు.. న్యాయ నిపుణులు మాత్రం ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ వాదనను కొట్టిపారేస్తున్నారు. ‘ఇది రాజ్యాంగానికి వక్రభాష్యమే. పైగా ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ ఉటంకిస్తున్న డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్‌ఫర్ తీర్పు అమెరికా సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత చెత్త తీర్పుగా నిలిచిపోయింది. తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వముందా, లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ గడ్డపై పుట్టే వారంతా దేశ పౌరులేనని ఆ తర్వాత సుప్రీంకోర్టు పలు తీర్పునిచ్చింది. ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ వాదనను వర్తింపజేయాల్సి వస్తే బ్రిటిష్ మూలాలున్న తొలినాళ్ల అధ్యక్షులు జార్జి వాషింగ్టన్, జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్ కూడా ఆ పదవికి అనర్హులే’’అని వారంటున్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు పలికిన ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ హారిస్‌పై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హారిస్ తల్లి భారత్‌కు, తండ్రి జమైకాకు చెందిన వారన్నది తెలిసిందే.
ఏమిటా తీర్పు?
డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్‌ఫర్ కేసు 1857 నాటిది. అప్పట్లో అమెరికాలో పలు రాష్ట్రాల్లో బానిసత్వానికి చట్టబద్ధత ఉండేది. తనను స్వేచ్ఛా జీవిగా ప్రకటించాలంటూ డ్రెడ్ స్కాట్ అనే ఆఫ్రికన్ అమెరికన్ బానిస సుప్రీంకోర్టుకెక్కాడు. అందుకు కోర్టు నిరాకరించింది. పైగా ‘ఆఫ్రికన్ అమెరికన్లు దేశ పౌరులే కాదు. కనుక వారికి సుప్రీంకోర్టుకెక్కే అర్హతే లేదు’’అని కోర్టు పేర్కొంది. పైగా దేశ అత్యున్నత చట్టసభ అయిన కాంగ్రెస్‌కు బానిసత్వాన్ని నిషేధించే అధికారం లేదంటూ తీర్పు వెలువరించింది. దాంతో అమెరికాలో బానిసత్వ రగడ తీవ్రతరమై అంతర్యుద్ధానికి దారితీసింది. ఆ తీర్పును పక్కన పెడుతూ అమెరికా రాజ్యాంగానికి 13, 14వ సవరణలు తీసుకొచ్చారు. బానిసత్వాన్ని రద్దు చేయడమే గాక జాతి భేదాలతో నిమిత్తం లేకుండా అమెరికాలో పుట్టిన వాళ్లంతా దేశ పౌరులేనంటూ చట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment