ప్రతీకాత్మక చిత్రం
రష్యా, చైనా సంయుక్త యోచన... పదేళ్లలో ఏర్పాటు చేసేలా కార్యాచరణ
చంద్రునిపై మనిషి శాశ్వత నివాస కలను వీలైనంత త్వరగా సాకారం చేయాలని రష్యా, చైనా తలపోస్తున్నాయి. అందుకవసరమైన విద్యుత్ అవసరాలను సోలార్ ప్యానళ్లు తీర్చలేకపోవచ్చనే ఉద్దేశంతో జాబిలిపై ఏకంగా అణు విద్యుత్కేంద్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి! అందుకోసం ఇప్పటికే సంయుక్త కార్యాచరణకు తెర తీశాయి కూడా...
అంతరిక్ష పోటీలో కీలక ముందడుగు వేసే దిశగా రష్యా, చైనా సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా చంద్రునిపై మనిషి శాశ్వత నివాస కలను నిజం చేసే దిశగా కదులుతున్నాయి. 2035 లోపు అక్కడ అణు విద్యుత్కేంద్రం ఏర్పాటు చేయాలని నిశ్చయానికి వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ చీఫ్ యూరీ బోరిసోవ్ తెలిపారు.
ఈ మేరకు తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారు. అయితే ఇదంతా సులువు కాబోదని యూరీ అంగీకరించారు. కాకపోతే, ‘‘న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ రంగంలో రష్యాకున్న అపార నైపుణ్యం ఈ విషయంలో బాగా ఉపయోగపడనుంది. మేం తలపెట్టిన ప్రాజెక్టు చంద్రునిపై మనిషి శాశ్వత ఆవాసం దిశగా కీలక ముందడుగు కానుంది. అక్కడ మున్ముందు ఎదురయ్యే ఇంధన అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు సోలార్ ప్యానళ్లు చాలవు. అణు విద్యుతే ఇందుకు సమర్థమైన ప్రత్యామ్నాయం. కనుకనే బాగా ఆలోచించిన మీదట ఈ ప్రాజెక్టును పట్టాలకెక్కించాం’’ అని ఆయన వివరించారు.
పర్యవేక్షణకు అంతరిక్ష ‘అణు’నౌక...
అయితే చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం వ్యవస్థాపన మాటల్లో చెప్పినంత సులువేమీ కాదు. ఇందుకోసం ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు యూరీ వెల్లడించారు....
► తొలి దశలో మానవ ప్రమేయంతో నిమిత్తం లేకుండా చంద్రునిపై అణు ప్లాంటు స్థాపన ప్రయత్నాలు పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిన సాగుతాయి.
► ఇందుకోసం ప్రధానంగా రోబోలను రంగంలోకి దించి వాటి సాయంతో పని నడిపిస్తారు.
► స్పేస్ టగ్‌బోట్ పేరిట అణు విద్యుత్‌తో నడిచే అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసే యోచనలో రష్యా ఉంది.
► ఇందులో భారీ అణు రియాక్టర్‌తో పాటు హై పవర్ టర్బైన్లు కూడా ఉంటాయి.
► విద్యుత్కేంద్రం తయారీకి కావాల్సిన సామగ్రిని దాన్నుంచే చంద్రునిపైకి పంపుతారు.
► దాని నిర్మాణ క్రమంలో వెలువడే అంతరిక్ష వ్యర్థాలు తదితరాలను క్లియర్ చేసే పని కూడా ఈ నౌకదే.
చల్లబరచేదెలా...?
చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం నిర్మాణంలో ఇమిడి ఉన్న అనేకానేక సాంకేతిక సమస్యలను అధిగమించడంలో రష్యా, చైనా తలమునకలుగా ఉన్నాయి. అయితే అణు ప్లాంటును ఎప్పటికప్పుడు చల్లబరచడం వాటికి అత్యంత కీలకమైన సవాలుగా మారనుంది. గతేడాది రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన లూనా–25 అంతరిక్ష నౌక అంతరిక్షంలో అదుపు తప్పి పేలిపోయింది. ఆ ఎదురుదెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయినా అణు కేంద్రం విషయంలో వెనక్కు తగ్గొద్దని పట్టుదలగా ఉంది.
ఆలోపే చైనాతో కలిసి మానవసహిత చంద్ర యాత్ర, ఆ వెంటనే చంద్రునిపై శాశ్వత బేస్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చైనా కూడా 2030 నాటికల్లా తమ తొలి వ్యోమగామిని చంద్రునిపైకి పంపడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటన్నింటినీ అమెరికా ఓ కంట కనిపెడుతూనే ఉంది. వీలైనంత త్వరగా అంతరిక్షంలో అణ్వాయుధాలను ఏర్పాటు చేసుకోవడమే రష్యా లక్ష్యమని ఇప్పటికే ఆరోపించడం తెలిసిందే. ఇదంతా పెద్ద దేశాల నడుమ అంతరిక్షంపై ఆధిపత్య పోరుకు దారి తీసే ఆస్కారం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా విని్పస్తున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment