మాస్కో: నిత్యం బాంబు దాడులతో దద్దరిల్లే సిరియాలో మరోసారి దాడులు జరిగాయి. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు, సామాన్యులపై చేసే దాడుల నేపథ్యంలోనే సిరియా పేరు వార్తల్లో వినపడుతోంది. తాజాగా మరోసారి బాంబుల మోతతో వార్తల్లో నిలిచింది సిరియా. కాకపోతే ఈ సారి దాడులు సామాన్య ప్రజలపై కాకుండా ఉగ్రవాదులపై జరిగాయి. ఈ ఘటనలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారు.
సిరియాలోని ఉగ్రవాద స్థావరంపై రష్యా తమ యుద్ధ విమానాలతో సోమవారం దాడి చేసింది. ఈ వైమానిక దాడిలో 200 మంది ఉగ్రవాదులు మృతి చెందారని, 24 వాహనాలు, సుమారు 500 కిలోగ్రాముల (1,100 పౌండ్లకు పైగా) మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను ధ్వంసం చేశామని రష్యా సైన్యం ప్రకటించింది. పల్మైరా ప్రాంతంలో ఉన్న క్యాంపులో ఉగ్రవాదులు పేలుడు పదార్థాల తయారీపై శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. ఈ సమాచారం అందిన వెంటనే రష్యా తమ సైన్యంతో ఈ దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇటీవల ఇద్దరు రష్యా సైనికులను చంపినట్లు ఇస్లామిక్ స్టేట్ పేర్కొనగా.. ప్రతీకార చర్యల్లో భాగంగానే రష్యా ఈ దాడులు చేసింది.
( చదవండి: తీవ్ర పరిణామాలు తప్పవు: రష్యాకు అమెరికా వార్నింగ్! )
Comments
Please login to add a commentAdd a comment