కరోనా దేవుడిచ్చిన వరం : ట్రంప్ | Trump says catching covid-19 was a blessing from God | Sakshi
Sakshi News home page

కరోనా దేవుడిచ్చిన వరం : ట్రంప్

Oct 8 2020 9:13 AM | Updated on Oct 8 2020 11:46 AM

Trump says catching covid-19 was a blessing from God - Sakshi

వాషింగ్టన్: కరోనా మహమ్మారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వింత వ్యాఖ్యలు చేశారు. కరోనా మామూలు ఫ్లూ లాంటిదే  అంటూ ప్రకటించి వివాదాన్ని రేపిన ట్రంప్ తాజాగా మరో వివాదాన్ని రాజేశారు.  తనకు  కరోనా సోకడం  దేవుడిచ్చిన వరమంటూ  అభివర్ణించారు. కోవిడ్-19 పాజిటివ్ రావడంతో మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి కోలుకున్న తర్వాత  ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కరోనా తనకు "దేవుని ఆశీర్వాదం" అని  భావిస్తున్నానన్నారు.  అందువల్లే దాన్ని నయం చేసే శక్తిమంతమైన డ్రగ్స్ గురించి తనకు తెలిసిందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్  మందులను ఉపయోగించడం వల్ల అది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తన అనుభవంలోకి వచ్చిందన్నారు.  (వైట్‌హౌస్‌కి కరోనా కాటు..)
   
తనకు చికిత్స అందించిన వైద్యులపై  ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అమెరికా పౌరులకు కూడా ఇదే స్థాయిలో ఉచితంగా చికిత్స అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు  కరోనా విస్తరణపై  డ్రాగన్ దేశంపై ఇప్పటికే పలుమార్లు  మండిపడిన ట్రంప్ మరోసారి తన దాడిని ఎక్కు పెట్టారు. ప్రపంచానికి చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.  చైనా చేసిన వైరస్‌కు  అమెరికన్లు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదంటూ విరుచుకుపడ్డారు.  కాగ  కరోనా మహమ్మారికి తీవ్రంగా ప్రభావితమైన దేశంగా అమెరికా నిలుస్తోంది. కరోనా విలయం కారణంగా ఇప్పటికే  రెండు లక్షల పదివేలకుపైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి  తెలిసిందే.  మరోవైపు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement