కీవ్: బాంబుల మోతలు, క్షిపణుల దాడులతో ఉక్రెయిన్ వణికిపోతోంది. యుద్ధం మొదలై 25 రోజులు గడుస్తున్నా ఫలితం కనిపించకపోవడంతో రష్యా మరింత రెచ్చిపోతోంది. అంతర్జాతీయ ఆంక్షలు ఓవైపు, స్వదేశంలో కూడా నిరసన గళాలు మరోవైపు వెరసి అధ్యక్షుడు పుతిన్‌కు చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో సైనిక స్థావరాలే కాకుండా సామాన్య ప్రజలను టార్గెట్ రష్యా చేసింది. ఈక్రమంలో భారీ ఎత్తున బాంబులు ప్రయోగిస్తోంది.
తొలిసారి కింజల్ ప్రయోగం
తాజాగా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణి ‘కింజల్’ను కూడా ప్రయోగించింది. ఉక్రెయిన్ సైనిక ఆయుధాగారంపై శుక్రవారం అర్ధరాత్రి కింజల్ విరుచుకుపడింది. పశ్చిమ ఉక్రెయిన్‌లో రొమేనియా సరిహద్దు సమీపంలోని ఇవనో–ఫ్రాంకివ్స్‌క్ ప్రాంతంలో క్షిపణులు, వైమానిక ఆయుధాలను నిల్వ చేసే భారీ భూగర్భ ఆయుధాగారాన్ని కింజల్ పూర్తిగా ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ప్రకటించారు. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో ప్రయోగించడం ఇదే తొలిసారి. దీంతో రష్యా అణు బాంబు ప్రయోగించే సాహసం చేస్తుందా అన్న అంశంపై రకరకాల విశ్లేషణలు విన్పిస్తున్నాయి.
అంచనాకు కూడా అందడం లేదు
రష్యా ప్రయోగిస్తున్న బాంబులు, క్షిపణుల్లో పేలనివాటిని, తమ సైన్యం అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేసేందుకు ఎన్నేళ్లు పడుతుందో అంచనాకు కూడా అందడం లేదని ఉక్రెయిన్ ఆందోళన వెలిబుచ్చింది. యుద్ధం ముగిశాక అమెరికా, యూరప్ దేశాలు ఇందుకు సాయం చేయాలని కోరింది. వాటిని నిర్వీర్యం చేసే సామగ్రి మారియుపోల్‌లో నాశనమైపోయిందని చెప్పింది.
(చదవండి: ప్రత్యర్థుల గుండెల్లో ‘పిడిబాకు’.. కింజల్ ప్రత్యేకతలివే!)
Comments
Please login to add a commentAdd a comment