వాషింగ్టన్: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే, ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టబోమని చైనాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్, శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం ఇచ్చిన విందులో పాలొన్నారు. ఈ సందర్భంగా భారతీయ అమెరికన్లతో ఆయన మాట్లాడారు. 2020 మేలో చైనాతో లద్దాఖ్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు.
‘భారత సైనికులు సరిహద్దుల్లో ఎలా వీరోచితంగా పోరాడారు, ప్రభుత్వం ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనే విషయాలను బహిరంగంగా చెప్పలేను. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. హాని చేయాలని చూస్తే ఎంతటి వారినయినా సరే భారత్ వదిలిపెట్టదనే సందేశాన్ని మాత్రం పంపించగలిగాం’అని అన్నారు. అదే విధంగా, అమెరికా వైఖరిపైనా రాజ్‌నాథ్ పరోక్షంగా కుండబద్దలు కొట్టారు. ఒక దేశంతో కొనసాగించే సంబంధాలు మరో దేశానికి నష్టం కలిగించకూడదనేదే భారత్ విధానమన్నారు. ఒక్కరికి మాత్రమే లాభం కలిగించే దౌత్య విధానాలపై తమకు నమ్మకం లేదని చెప్పారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ వైఖరిపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక దేశంతో సత్సంబంధాలను కలిగి ఉండటం అంటే..మరో దేశంతో తెగదెంపులు చేసుకోవడం కాదన్నారు. ఇరుపక్షాలకు లాభదాయకమైన ద్వైపాక్షిక సంబంధాలనే భారత్ కోరుకుంటుందన్నారు. భారత్ బలహీనం కాదు, శక్తివంతమైన దేశమనే విషయం ఇప్పుడు ప్రపంచదేశాలకు తెలిసిందన్నారు. భారత్–అమెరికా సంబంధాలు మరింత బలీయంగా కావడం వెనుక భారతీయ అమెరికన్ల కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. సంస్కృతీ సంప్రదాయాలను మరవొద్దని కోరారు.
గుటెరస్‌తో జై శంకర్ భేటీ
విదేశాంగమంత్రి జై శంకర్ గురువారం ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌తో సమావేశమయ్యారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అఫ్గానిస్తాన్, మయన్మార్‌లలో పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు జై శంకర్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం.. ముఖ్యంగా ఇంధన, ఆహార భద్రత. అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతున్న ప్రభావం వంటివాటిపై గుటెర్రస్‌తో అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆయన వివరించారు. సమకాలీన సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు గుటెర్రస్ ఆసక్తి చూపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్–అమెరికా మధ్య జరిగిన 2+2 మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రులు రాజ్‌నాథ్, జై శంకర్ ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment