రష్యా ఉక్రెయిన్ సంక్షోభం మరింత ముదురుతోంది. వెనక్కి తగ్గినట్లే తగ్గి.. దూకుడు చూపిస్తోంది రష్యా. ప్రతిగా అమెరికా కౌంటర్ ఇస్తోంది. ముఖ్యంగా వేర్పాటువాద ప్రాంతాల మద్ధతుతో ఉక్రెయిన్ సరిహద్దు వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది రష్యా. ఈ క్రమంలో ఇవాళ కీలక పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి.
రష్యాకి దన్నుగా నిలుస్తున్న ఉక్రెయిన్ తూర్పు వైపు ఉన్న తిరుగుబాటు ప్రాంతాలకు ఊహించని ఝలక్ ఇచ్చింది అమెరికా. ఆర్థిక ఆంక్షలతో పాటు రష్యా మీదా కొత్త ఆంక్షలను విధించనున్నట్లు ఇవాళ (మంగళవారం) ప్రకటించేసింది.
ఒకపక్క రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ తిరుగుబాటునేతలతో క్లెమ్లిన్‌లో సమావేశమై.. పరస్సర సహకారం, స్నేహపూర్వక ఒప్పందాలపై సంతకం చేశాడు. ఆ వెంటనే డోనెట్‌స్క్, లుగన్‌స్క్‌లను(ఉక్రెయిన్ రెబల్ ప్రాంతాలు) స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు పుతిన్. ఉక్రెయిన్‌ను పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా, ఒక విఫల రాజ్యంగా అభివర్ణించాడు. అంతేకాదు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో తిష్ట వేయాలని రష్యా సైన్యాన్ని ఆదేశించాడు కూడా. ఈ నేపథ్యంలో..
అమెరికా వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఆ రెండు రెబల్ రాజ్యాలపై ఆంక్షలు విధించింది. ‘అంతర్జాతీయ చట్టాల కఠోరమైన ఉల్లంఘనలకు గానూ ప్రతిగా రష్యాకు ఒరిగే లాభాన్ని దూరం చేయడానికే(రెబల్స్‌తో ఒప్పందాన్ని ఉద్దేశించి) నేను ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశా. తక్షణమే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయి. తదుపరి చర్యలపై ఉక్రెయిన్‌తో సహా మిత్రదేశాలు, భాగస్వాములతో అమెరికా సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతోంది.’ : తాజా ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
ఉక్రెయిన్ రెబల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వొద్దంటూ అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ముందు నుంచి రష్యాను హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ హెచ్చరికలను తుంగలో తొక్కి.. సంక్షోభాన్ని చల్లబర్చే పరిస్థితుల్ని మరింత సంక్లిష్టం చేసింది రష్యా. రెబల్స్ మద్ధతుతో ఉక్రెయిన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, దాడులకు తెగబడుతోంది. మరోవైపు అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశిస్తూ.. తాము దౌత్యపరమైన చర్చలకు సిద్ధమని, కేవలం సరిహద్దు డ్రిల్స్‌ను ముప్పుగా ఎలా పరిగణిస్తారని రష్యా వాదిస్తోంది.
ఆక్రమణ మొదలైనట్లే..
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై ఇవాళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఉక్రెయిన్, అమెరికా, మెక్సికో, ఐదు యూరోపియన్ దేశాల విజ్ఞప్తి మేరకే ఈ సమావేశం నిర్వహించింది భద్రతా మండలి. మరోవైపు రష్యా ఉక్రెయిన్ ఆక్రమణ మొదలుపెట్టిందంటూ బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ ప్రకటించడం విశేషం. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఇప్పటికే ప్రారంభమైంది. కాబట్టి బ్రిటన్ రష్యాపై ఆంక్షలు విధిస్తోంది’’ అని ప్రకటించారాయన. ఉక్రెయిన్ సంక్షోభంపై మంగళవారం జరిగిన emergency government response meetingకి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ అధ్యక్షత వహించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment