వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల వేళ అగ్ర రాజ్యం అమెరికా రాజకీయం ఆసక్తికరంగా మారింది. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారీస్ పోటీ నిలుస్తున్నారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. కాగా, ఆమె రేసులో వచ్చిన వెంటనే ట్రంప్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ఎన్నికల సర్వేల్లో కమలా హారీస్ దూసుకుపోతున్నారు.
వివరాల ప్రకారం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో సమానంగా కమల హారీస్ ప్రజామోదాన్ని పొందుతున్నారని న్యూయార్క్ టైమ్స్– సియానా కాలేజ్ తాజా పోల్స్‌లో వెల్లడించింది. ఇక, సర్వేలో పాల్గొన్న అమెరికా ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్ వైపు మొగ్గగా, 47 శాతం మంది కమలా హారీస్‌కు మద్దతు తెలిపారు. ఇదే న్యూయార్క్ టైమ్స్ పత్రిక జూలై మొదటివారంలో నిర్వహించిన సర్వేలో బైడెన్‌పై ట్రంప్ ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీన్ని హారీస్ ఒక పాయింటుకు తగ్గించడం గమనార్హం. రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్‌కు 48 శాతం, హారీస్‌కు 46 శాతం మద్దతు లభించింది.
ఇదిలా ఉండగా.. రిపబ్లికన్లలో ట్రంప్‌ను 93 శాతం మంది బలపరుస్తుండగా, కమలా హారిస్‌కు సైతం డెమోక్రాట్లలో 93 శాతం మద్దతు లభించడం విశేషం. శ్వేతజాతియేతర, యువ ఓటర్లలో బైడెన్‌కు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇప్పుడు హారీస్‌కు మాత్రం ఈ వర్గాల నుంచి భారీగా మద్దతు లభిస్తోందని సర్వే తెలిపింది. లాటిన్ అమెరికా మూలాలున్న ఓటర్లు, 30 ఏళ్ల లోపు ఓటర్లలో హారిస్‌కు 60 శాతం మద్దతు లభించింది.
మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల రేసులో కమలా హరీస్ వచ్చిన వెంటనే ఆమెకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుంది. అంతకుముందు జరిపిన ఓ ఎన్నికల సర్వేలో కూడా ట్రంప్ కంటే కమలా హారీస్ ముందంజలోనే ఉన్నారు. దాదాపు రెండు శాతం ఓట్లతో కమలా దూసుకెళ్లారు. దీంతో, రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనంటూ డెమోక్రాట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, సొంత పార్టీలో కూడా నేతల నుంచి హారీస్‌కు పూర్తి మద్దతు లభించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment