
వాషింగ్టన్: అమెరికా సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్టు అధారిటీ సంచలన వీడియోను షేర్ చేసింది. యూటా రాష్ట్రంలో సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఉన్న 84 అడుగుల డెల్టా టవర్‌ను కూల్చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లకు వాటి గేట్‌లకు దారి చూపేందుకు దీన్ని 1989లో నిర్మించారు. ఈ టవర్ కూల్చివేత రెండవ దశలో ఈ టవర్‌ను పూర్తిగా నేలమట్టం చేశారు. కేవలం కొన్ని సెకన్లలోనే ఈ టవర్ కుప్పకూలిన వీడియోను అక్కడి అధికారులు ట్విటర్‌లో షేర్ చేశారు. అంతే లక్షల లైక్స్, వేలాది వ్యూస్‌తో ఇది నెటింట్లో హల్ చల్ చేస్తోంది.
డెల్టా టవర్ కూల్చివేయడంలో ఇదొక ప్రధాన మైలురాయి అని సాల్ట్ లేక్ విమానాశ్రయ ప్రతినిధి నాన్సీ వోల్మర్ చెప్పారు.గత సెప్టెంబర్‌లో కొత్త విమానాశ్రయం ప్రారంభమయ్యేవరకు డెల్టా టవర్ కార్యకలాపాలు కొనసాగాయన్నారు. అయితే ఇందులో కొన్ని సదుపాయాలను ఆ తరువాత కూడా కొనసాగించాలని అనుకున్నా కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ గేట్లు అవసరం లేదని తాము భావించినట్టు ఆమె వెల్లడించారు.