పాలనాపరంగానే కాదు.. దౌత్య విషయాల్లోనూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‘పూర్’ అని నిరూపించుకుంటున్నాడు. ఆ మధ్య వాణిజ్యం పేరిట చైనా పర్యటనకి వెళ్లి మరీ.. వేర్పాటువాద దాడుల విషయంలో అక్షింతలు వేయించుకుని వచ్చాడు. ఇక ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో రష్యా పర్యటనకు వెళ్లి మరీ తిట్లు తిన్నాడు. ఇప్పుడేమో అమెరికా-యూరప్ మిత్రపక్షాలపై అసంతృప్తి వెల్లగక్కి మరోసారి విమర్శల పాలయ్యాడు.
పశ్చిమ దేశాల దౌత్య వేత్తలను ఉద్దేశించి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండించాలని, తాము విధిస్తున్న ఆంక్షలను సమర్థించాలంటూ పశ్చిమ దేశాల రాయబారులు, ఖాన్ సాబ్ మద్దతు కోరారు. ఈ మేరకు ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహా 22 దౌత్య మిషన్ల అధిపతులు మార్చి 1న సంయుక్త లేఖను విడుదల చేశారు. అయితే.. దీనికి ఇమ్రాన్ ఖాన్ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది.
‘‘అసలేం అనుకుంటున్నారు? మీరు చెప్పిందల్లా చేయడానికి మేం మీ బానిసలం అనుకుంటున్నారా?. యూరోపియన్ ఎంబాసిడర్లకు నా సూటి ప్రశ్న. ఇలాంటి లేఖ మీరు భారత్‌కు రాశారా? ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో వాళ్లను(భారత్) నిలదీశారా?. లేదుకదా? మాటిమాటికి మమ్మల్నే ఎందుకు బద్నాం చేస్తారు? మేం అంత తేలికగా దొరికామా?’’ అంటూ ఆదివారం సాయంత్రం ఓ పొలిటికల్ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు.
అంతేకాదు.. ఆఫ్ఘనిస్తాన్‌లో పాశ్చాత్య నాటో కూటమికి మద్దతివ్వడం వల్ల పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయిందని, కృతజ్ఞతతో కాకుండా విమర్శలను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. ‘‘మేం రష్యాకు స్నేహితులం. అమెరికాకు స్నేహితులం. చైనా, యూరప్ దేశాలతోనూ స్నేహంగానే ఉంటాం. వేరేవాళ్లలాగా క్యాంపులు నడిపించడం మాకు చేతకాదు. అందుకే తటస్థంగా ఉండాలనుకుంటున్నాం’’ అని ప్రకటించాడు ఇమ్రాన్ ఖాన్. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ సంక్షోభంపై దౌత్య వేత్తలు బహిరంగంగా లేఖ రాయడం వల్లే పాక్ ఇలా చిందులు తొక్కుతోంది.
Comments
Please login to add a commentAdd a comment