సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలు ఉండగా.. తొమ్మిది స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తొలిజాబితా అభ్యర్థులకు శనివారం రాత్రే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్ చేసి పోటీకి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినా అధికారికంగా ప్రకటించేవరకూ ఈ విషయాన్ని ఎవరూ వెల్లడించలేదు. 2018 ఎన్నికలతో పోల్చితే నాయకుల విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు స్థానాల్లో ప్రాతినిధ్యం కరవవడం.. లేదా పొత్తులతో సాగే చరిత్ర ఉన్న బీజేపీ తాజాగా బలోపేతమైంది. ప్రస్తుతం ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, జెడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే బరిలో ఉండటం గమనార్హం.
పార్టీ ప్రకటించింది వీరినే..
► కోరుట్లకు ధర్మపురి అరవింద్, జగిత్యాలకు భోగ శ్రావణి, ధర్మపురికి ఎస్.కుమార్, చొప్పదండికి బొడిగె శోభ, రామగుండంకు కందుల సంధ్యారాణి, సిరిసిల్లకు రాణీ రుద్రమదేవి, కరీంనగర్‌కు బండి సంజయ్, మానకొండూరుకు ఆరెపల్లి మోహన్, హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్ పేర్లను పార్టీ ప్రకటించింది. ఈటల తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌తోపాటు ప్రస్తుతం సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి కూడా బరిలోకి దిగనుండటం విశేషం. జిల్లా చరిత్రలో కేసీఆర్ తరువాత రెండుసార్లు బరిలోకి దిగుతున్న ఏకై క నాయకుడు ఈటల కావడం గమనార్హం. 2004లో కరీంనగర్ ఎంపీ, సిద్దిపేట అసెంబ్లీకి పోటీ చేసిన కేసీఆర్.. రెండుచోట్లా విజయం సాధించారు. తరువాత సిద్దిపేట స్థానానికి రాజీనామా చేశారు. దాదాపు 19 ఏళ్ల తరువాత కరీంనగర్ నుంచి రెండుచోట్ల అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుండటం విశేషం.
ముగ్గురు సీఎం అభ్యర్థులు
► బీసీ సీఎం నినాదంతో బీజేపీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగే యోచనలో ఉంది. పార్టీలో బీసీ సీఎం అభ్యర్థి ప్రతిపాదన రాగానే.. ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల మధ్య పోటీ మొదలైంది. మరోవైపు తాను ఏమాత్రం తక్కువా..? అన్నట్లు కోరుట్ల అసెంబ్లీ నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగారు.
► బండి సంజయ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గంగుల కమలాకర్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించారు. ఆ తరువాత రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి బీజేపీకి ఊపు తెచ్చారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని విజయతీరా లకు చేర్చారు. 8శాతం ఉన్న ఓటుబ్యాంకును అమాంతం పెంచారు. పార్టీ తరఫున బీసీ సీఎంగా తమ నాయకుడే ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా సంజయ్ అనుచరులు కోరుకుంటున్నారు.
► తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్ వేదికగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈటల రాజేందర్ 2004, 2008, 2009, 2010, 2014, 2018, 2021లో వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, శాసనసభాపక్ష నేతగా పనిచేసిన అనుభవంతో రాజేందర్ సైతం పార్టీ సీఎం అభ్యర్థి అవుతారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.
► ఎలాగైనా అసెంబ్లీ బరిలో ఉండాలన్న పట్టుదలతో కొంతకాలంగా ధర్మపురి అర్వింద్ కోరుట్లలో చాపకింద నీరులా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. సంజయ్ కొత్త అభ్యర్థి కావడం, తాను ఎంపీగా ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే కోరుట్ల ఉండటం, తన అమ్మమ్మ ఊరు కావడం, సొంత సామాజికవర్గం సహకారం తదితరాల లెక్కలతో అర్వింద్ ఈసారి కోరుట్లపై కన్నేశారు.
బండి సంజయ్
జన్మదినం: 11–07–1971
విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్
స్వగ్రామం: కరీంనగర్
అనుభవం: 2005, 2014లో కార్పొరేటర్, 2014, 2018 ఎమ్మెల్యే స్థానానికి పోటీ, 2019 ఎంపీగా విజయం.
అదనపు సమాచారం: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి, ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి
సామాజిక వర్గం: మున్నూరుకాపు
ఈటల రాజేందర్
జన్మదినం: 20–03–1964
విద్యార్హతలు: పీజీ (ఉస్మానియా)
స్వగ్రామం: కమలాపూర్ (ప్రస్తుతం హన్మకొండ జిల్లా)
అనుభవం: ఏడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి, శాసనసభ పక్షనేత
అదనపు సమాచారం: 2021లో బీజేపీలో చేరిక. చేరికల కమిటీ చైర్మన్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్.
సామాజిక వర్గం: ముదిరాజ్
పోటీకి బండి, ఎస్.కుమార్ అనాసక్తి..
కేంద్రమంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతున్న క్రమంలో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదేశాలు రావడంపై బండి సంజయ్.. అసలు తనకు మాట మాత్రమైనా చెప్పకుండా ధర్మపురిలో పోటీ చేయాలని చెప్పడంపై ఎస్.కుమార్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
బొడిగె శోభ
జన్మదినం: 1972
విద్యార్హతలు: పదవ తరగతి
స్వగ్రామం: వెంకటేశ్వర్లపల్లె, సైదాపూర్ మండలం
అనుభవం: 2001 శంకరపట్నం జెడ్పీటీసీ, 2014లో ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్), 2018 ఎమ్మెల్యేగా ఓటమి.
అదనపు సమాచారం: చొప్పదండి బీజేపీ ఇన్‌చార్జి
సామాజికవర్గం: ఎస్సీ (మాదిగ)
ధర్మపురి అర్వింద్
జన్మదినం: 25–08–1976
విద్యార్హతలు: ఎంఏ.పొలిటికల్ సైన్స్
స్వగ్రామం: నిజామాబాద్
అనుభవం: 2019 నిజామాబాద్ ఎంపీ,
అదనపు సమాచారం: కేంద్ర వాణిజ్య స్టాండింగ్ కమిటీ సభ్యులు
సామాజికవర్గం: మున్నూరుకాపు
ఎస్.కుమార్
జన్మదినం: 10–10–1966
విద్యార్హతలు: ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం (ఉస్మానియా)
స్వగ్రామం: గోదావరిఖని
అనుభవం: రామగుండం మున్సిపాలిటీ చైర్మన్ 2004, 2009 ధర్మపురి ఎమ్మెల్యే స్థానానికి, 2019 పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసిన అనుభవం
అదనపు సమాచారం: జర్నలిస్టుగా అనేక అవార్డులు, బీజేపీ జాతీయస్థాయిలో పలు పదవుల నిర్వహణ.
సామాజికవర్గం: ఎస్సీ (మాల)
ఆరెపల్లి మోహన్
జన్మదినం: 6–6–1955
విద్యార్హతలు:ఎంకామ్,ఎల్‌ఎల్‌బీ
స్వగ్రామం: మానకొండూరు
అనుభవం: సర్పంచి, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, విప్. 2009లో మానకొండూరు ఎమ్మె ల్యే, 2014, 2018లో అక్కడ నుంచే పరాజయం.
అదనపు సమాచారం: 2019లో బీఆర్‌ఎస్‌లో చేరిక, టికెట్ ఆశించి భంగపడి కమలం గూటికి.
సామాజికవర్గం: ఎస్సీ (మాదిగ)
Comments
Please login to add a commentAdd a comment