సైబర్ మోసాలపై వాకర్స్‌కు అవగాహన
జగిత్యాలజోన్: సైబర్ మోసాలపై అదివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని మినీస్టేడియంలో వాకర్స్‌కు అవగాహన కల్పించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఎస్‌బీఐ క్యాష్ ఆఫీసర్ నలువాల గంగాధర్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై అవగాహనతోనే మోసాలను అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు గంగాధర్, కృష్ణ, సంతోష్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం ఉదయం 8.30గంటల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య కదలాడాయి. మల్లాపూర్ మండలకేంద్రం, బీర్‌పూర్ మండలం కొల్వాయిలో 12.6, కథలాపూర్‌లో 12.7, భీమారం మండలం మన్నెగూడెంలో 12.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఘనంగా కోటి లలిత జప యజ్ఞం
ధర్మపురి: ధర్మపురిలోని బ్రాహ్మణ సంఘ భవనంలో కోటి లలిత జపయజ్ఞం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మండలంలోని ఆర్యవైశ్యులు, లలిత భక్తులతో విశ్వనాథం గురుపీఠం ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు లలితా పారాయణం, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలో పాల్గొన్నారు.
క్రీడలతో స్నేహ సంబంధాలు
రాయికల్: క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు టోర్నమెంట్లు దోహదపడతాయని పేర్కొన్నారు. వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్న ఆర్గనైజర్ సుతారి తిరుపతిరెడ్డిని అభినందించారు. ఆయన వెంట నాయకులు అత్తిరెడ్డి గంగారెడ్డి, తంగెళ్ల రమేష్, రాజేశ్వర్ రెడ్డి, పోతు వెంకటేశ్, శ్రీనివాస్, భూమన్న తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు గురుకులం విద్యార్థినులు
మల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌లో జరిగిన పోటీల్లో విద్యార్థినులు కె.మనుస్మిత, ఆర్.మనీష, ఎస్.రేవతి, సీహెచ్.సంజన, ఎ.జస్మిక, ఎస్.సంజన ఉత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధునిక ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment