స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం
● ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం ● జగిత్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్ ● జిల్లా ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
రాయికల్: అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజావ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారిని ప్రజలు క్షమించబోరని స్పష్టం చేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జగిత్యాల నియోజకవర్గ నాయకులతో కవిత సమావేశమయ్యారు. జగిత్యాలతో తనది ఆత్మీయ అనుబంధమని గుర్తు చేశారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా తాను గెలిచానని, జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారని, అయినప్పటికీ కేసీఆర్ మాత్రం జగిత్యాల అభివృద్ధిని కాంక్షించారని పేర్కొన్నారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడంతోపాటు, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4,500 డబుల్ బెడ్ రూం ఇళ్లు జగిత్యాలకే కేటాయించి ప్రత్యేక శ్రద్ధ చూపారని తెలిపారు. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్‌ని పార్టీ ప్రతి కార్యక్రమంలో వేదికపైకి తీసుకొచ్చి.. కాబోయే ఎమ్మెల్యే అంటూ ఐదేళ్లపాటు చెప్పామన్నారు. ఓడిపోయినా గౌరవంగా చూసుకుంటుందనే సందేశం ఇచ్చిన సభ్యత గల పార్టీ బీఆర్‌ఎస్ అన్నారు. నాడు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి ఎన్ని ఆకృత్యాలు, అఘాయిత్యాలు చేసినా.. బీఆర్‌ఎస్ కార్యకర్తలంతా ముందుండి కొట్లాడారు కాబట్టే ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు. నాయకులు పార్టీలు మారినా.. కార్యకర్తలు పార్టీలోనే ఉంటారని చెప్పడానికి మంచి ఉదాహరణ జగిత్యాల నియోజకవర్గమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని, పార్టీ నుంచి కార్యకర్తలు, స్థానిక నాయకత్వానికి సంపూ ర్ణ మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే పార్టీ మారారనే అంశంతో సంబంధం లేకుండా గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, స్థానిక నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment