ఆకలి చదువులు! | - | Sakshi
Sakshi News home page

ఆకలి చదువులు!

Published Thu, Jan 30 2025 12:26 AM | Last Updated on Thu, Jan 30 2025 12:26 AM

ఆకలి చదువులు!

ఆకలి చదువులు!

రాయికల్‌: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్లు ‘ఉత్తేజం’ వంటి కార్యక్రమాలు చేపట్టారు. దీనికి కొందరు విరాళాలు ప్రకటించగా.. ప్రభుత్వం నుంచి కొంత మొత్తం నిధులు విడుదలయ్యేవి. ఈ నిధులతో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించేవారు. పరీక్షలు ప్రారంభమయ్యే వరకూ అల్పాహారం అందించి వారిని ప్రోత్సహించేవారు. ప్రస్తుత జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ అల్పాహారం విషయంలో మాత్రం చొరవ చూపడం లేదు. ఫలితంగా వివిధ గ్రామాల నుంచి వేకువజామునే బస్సుల్లో వచ్చే విద్యార్థులు ఆకలితోనే చదువుకునే పరిస్థితి నెలకొంది.

7,497 మంది విద్యార్థులు

జిల్లాలో 189 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అలాగే మోడల్‌ స్కూళ్లు, 13, కేజీబీవీ 16, రెసిడెన్షియల్‌ స్కూళ్లు 2 ఉన్నాయి. ఇందులో 7,497 విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు గతేడాది అక్టోబర్‌ నుంచే విద్యాశాఖ సాయంత్రం 4.15గంటల నుంచి 5.15 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఈనెల 20 నుంచి ఉదయం 8.15 గంటల నుంచి 9.15 వర కు ప్రతిరోజూ ఓ సబ్జెక్ట్‌ ఉపాధ్యాయుడిని ఏర్పా టు చేసి విద్యార్థులను చదివించడం, వారి సందేహాలను నివృత్తి చేయడం, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించడం చేస్తున్నారు.

ఆకలితో విద్యార్థులు

చదువుకునేందుకు ఉదయం 8గంటలకే విద్యార్థులు పాఠశాలకు చేరుకుంటున్నారు. వీరిలో చాలామంది నిరుపేదలే ఉంటున్నారు. అంత ఉదయం ఇళ్లలో వంటకాలు కాకపోవడంతో ఏమీ తినకుండానే పాఠశాలకు చేరుకుంటున్నారు. అలాంటి వారికి మధ్యాహ్న భోజనమే దిక్కవుతోంది. మధ్యాహ్నం వరకూ విద్యార్థులు ఖాళీ కడుపుతోనే ఉండాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనూ పిల్లలు ఆకలితోనే అలమటించాల్సి వస్తోంది. ఫలితంగా విద్యార్థులు నీరసించిపోతున్నారు.

జిల్లా యంత్రాంగం, దాతలు స్పందించాల్సిందే

జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై జిల్లా కలెక్టర్‌తో పాటు, విద్యాశాఖ అధికారులు స్పందించి గతంలో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలకు అల్పాహారం కింద నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. దాతల సహకారంతో స్నాక్స్‌ అందిస్తే విద్యార్థులను ప్రోత్సహించినట్లవుతుందని అంటున్నారు. పైగా ఉత్తీర్ణత శాతం పెంచేందుకు దోహదపడుతుందని అంటున్నారు.

ఆకలితోనే చదువులు

కొనసాగుతున్న ప్రత్యేక క్లాస్‌లు

గతంలో ‘ఉత్తేజం’ కింద నిధులు

తాజాగా ఎవరూ ముందుకు రాని తీరు

జిల్లాలో 7,497 మంది విద్యార్థులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement