సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్‌లో జనగామ మినహా 11 నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులు ప్రచార బరిలోకి దిగారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఢీకొట్టగల అభ్యర్థులను బరిలోకి దింపే దిశగా కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 25న ముగిసింది. ఆదరఖాస్తులు టీపీసీసీ నుంచి సీడబ్ల్యూసీ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీలకు చేరాయి. ఎమ్మెల్యే ప్రవాస్ యోజన పేరిట బీజేపీ ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే బీఆర్‌ఎస్ 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు సైతం అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ఎత్తులు, పైఎత్తులు.. పోటాపోటీ కార్యక్రమాలతో మూడు పార్టీల్లో రాజకీయాలు వేడెక్కాయి.
తొలి జాబితాలో చోటెవ్వరికీ.. కాంగ్రెస్ ఆశావహుల్లో ఉత్కంఠ
కాంగ్రెస్ అధిష్టానం దూకుడు చూస్తే ఈనెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈప్రక్రియలో భాగంగానే ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి ఈనెల 18 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ములుగు, భూపాలపల్లి మినహా అన్ని నియోజకవర్గాల నుంచి ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. ములు గు సిట్టింగ్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క (అనసూయ), భూపాలపల్లి గండ్ర సత్యనారాయణకు ఖరారు కాగా.. నర్సంపేటకు దొంతి మాధవరెడ్డి ఫైనల్ అంటున్నారు.
మిగతా చోట్ల ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్న చోట ముగ్గురి పేర్లను పరిశీలనలోకి తీసుకోనున్నారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ, డాక్ట ర్ కత్తి వెంకటస్వామిగౌడ్, వరంగల్ పశ్చిమకు నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి, కట్ల శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జనగామలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య మధ్య నువ్వా నేనా? అనే రీతిలో ఉంది. పాలకుర్తి నుంచి దాదాపుగా అనుమాండ్ల ఝూన్సీ రెడ్డికి ఖాయమంటున్నా... బండి సుధాకర్, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నా యి.
పరకాలలో ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కొండా మురళిలో ఒకరికి.. మహబూబాబాద్ నుంచి పోరిక బలరాంనాయక్, బెల్లయ్యనాయక్, డాక్టర్ మురళి నాయక్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చంటున్నా రు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు దొమ్మాటి సాంబయ్య, ఇందిర,డాక్టర్ బి.కృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్న ట్లు పార్టీవర్గాల సమాచారం. డోర్నకల్ నుంచి జా టోత్ రాంచంద్రు నాయక్, మాలోత్ నెహ్రూ నాయ క్, నూనావత్ భూపాల్‌నాయక్, వర్ధన్నపేటకు నమిండ్ల శ్రీనివాస్, కేఆర్.నాగరాజు, బక్క జడ్సన్, సిరిసిల్ల రాజయ్య పేర్లపై చర్చ జరుగుతోంది.
సెప్టెంబర్ 17 తర్వాత కమల దళం
గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నాయకులు సీట్ల కోసం పోటీ పడుతున్నారు. రాజకీయాలకు అంటీముట్టనట్లున్న డాక్టర్లు, కాంట్రాక్టర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆపార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం సెప్టెంబర్ 17 తర్వాతే అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటన ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఆశావహ నేతలంతా హైదరాబాద్, ఢిల్లీ నేతలతో టచ్‌లోకి వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారు. మహబూబాబాద్, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లిలో ఆ పార్టీకి బలం ఉంది. 2018 ఎన్నికల్లో ఈనియోజకవర్గాల్లో ఆపార్టీ అభ్యర్థులు ఓటమి పాలైనా ఓట్లు రాబట్టుకున్నారు. ఇప్పుడు ఆ స్థానాల నుంచి అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు.
12 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను పెట్టనున్న బీజేపీ అధిష్టానం దీటైన వ్యక్తుల కోసం ఆరా తీస్తుండగా.. ఎన్నికల సమయం సమీపిస్తున్నా కొద్దీ బీజేపీలో టికెట్ల పోరు ముదురుతోంది. వరంగల్ తూర్పు నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుసుమ సతీశ్, గంట రవికుమార్, వన్నాల వెంకటరమణ, వరంగల్ పశ్చిమకు మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, రావు పద్మ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి మాజీ మంత్రి డాక్టర్ జి.విజయరామారావు, మహబూబాబాద్ నుంచి జాటోత్ హుస్సేన్‌నాయక్, భూపాలపల్లి నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి, నర్సంపేట, వర్ధన్నపేట నుంచి మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండేటి శ్రీధర్ పేర్లున్నాయి. జనగామకు ఆరుట్ల దశమంతరెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి, బేజాటి బీరప్ప, ప్రేమలతారెడ్డి, ములుగు నుంచి అజ్మీరా కృష్ణవేణి నాయక్, భూక్యా రాజునాయక్, తాటి కృష్ణ, భూక్యా జవహర్‌లాల్ టికెట్ ఆశిస్తున్నారు. పరకాల నుంచి మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పేర్లుండగా.. 27న పార్టీలో చేరిన డాక్టర్ కాళీప్రసాద్ పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment