
ఉత్పత్తిలో వెనుకంజ
భూపాలపల్లి అర్బన్: గడిచిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో భూపాలపల్లి ఏరియా కాకతీయ గనుల్లో సింగరేణి యాజమాన్యం నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించకుండా వెనుకంజలో ఉంది. 49.60లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 37.02లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేసి 75శాతంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 46.54 లక్షల ఉత్పత్తి లక్ష్యం సింగరేణి యాజమాన్యం విధించారు. గతేడాది కంటే సుమారు 3లక్షల టన్నుల టార్గెట్‌ను తగ్గించారు. భూపాలపల్లి ఏరియాలో నాలుగు భూగర్భ గనులు, రెండు ఓపెన్‌కాస్టు గనులు ఉన్నాయి. ఈ ఏడాది మిగిలిన 12,57,708 లక్షల బొగ్గు ఉత్పత్తిని వెలికితీయలేకపోయారు. ఈ మేరకు ఇప్పటినుంచి నిర్ధేశించిన ఉత్పత్తిని సాధించేందుకు అధికారులు ఏరియాలోని ప్రతి గనికి నెలలు, రోజు వారీగా విభజించి కేటాయించారు. వెలికితీసిన బొగ్గు ఉత్పత్తిలో 33.66లక్షల టన్నుల బొగ్గును రవాణ చేశారు.
లక్ష్యానికి దూరంగా ఓసీ–3
భూపాలపల్లి ఏరియాలో నాలుగు భూగర్భ గనులకు 9.60లక్షలు, రెండు ఓపెన్‌కాస్టులకు 40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయించారు. వాటిలో భూగర్భ గనుల నుంచి 6,93,013, ఓపెన్‌కాస్ట్ 2–ప్రాజెక్ట్‌లో 15లక్షల టన్నుల టార్గెట్‌గాను 14,67,133, ఓసీ–3లో 25లక్షల టన్నులకు కేవలం 15,42,146 టన్నులు మాత్రమే సాధించి 62శాతంలో నిలిచింది. ఓపెన్‌కాస్టుల ద్వారానే తక్కువ సమయంలో ఎక్కువ బొగ్గును వెలికితీయాలనే ఉద్దేశం ఏర్పాటు చేశారు. ఓపెన్‌కాస్టు 3 ప్రాజెక్ట్‌ను ప్రారంభించి నాలుగేళ్లవుతున్నా పూర్తిస్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేయడం లేదు. భూగర్భ గనులతో సమానంగా ఓపెన్‌కాస్టులో కూడా ఉత్పత్తి తగ్గడంతో భూపాలపల్లి ఏరియా ఉత్పత్తిలో వెనుకబడింది.
కారణాలెన్నో..
భూగర్భ, ఓపెన్‌కాస్టు గనుల్లో ఉత్పత్తి తగ్గడానికి అధికారులు అనేక కారణాలు చూపిస్తున్నారు. భూగర్భ గనుల్లో కార్మికుల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉండటం, సర్ఫెస్ కార్మికుల సంఖ్య ఎక్కువగా పెరగడం కారణాలు ఉన్నాయి. ఈ ఏడాది ఽఅధికంగా వర్షాలు కురవడంతో ఓపెన్‌కాస్టుల్లో రోజుల తరబడి ఉత్పత్తిని నిలిచిపోయింది. దీంతో ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం పడింది. ఓపెన్‌కాస్టు 3లో ఓబీ పనులు సక్రమంగా సాగకపోవడం, భూసేకరణ అనుకున్న స్థాయిలో జరగపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఓసీపీ–2లో 182లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి లక్ష్యానికి గాను 152 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని, ఓసీపీ–3లో 254లక్షల క్యూబిక్ మీటర్లకుగాను 127లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే వెలికితీశారు. పూర్తిస్థాయిలో మట్టి వెలికితీతను కూడా చేపట్టకుండా 72శాతంలోనే ఉంది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో
75 శాతం బొగ్గు ఉత్పత్తి
ఈ ఏడాదికి ఉత్పత్తి లక్ష్యం
46.53లక్షల టన్నుల బొగ్గు
నష్టాల్లో భూపాలపల్లి ఏరియా
ఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు
భూపాలపల్లి ఏరియాలో భూగర్భగనులు, ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాఽధించేందుకు ఇప్పటి నుంచే కావాల్సిన ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే సుమారు రూ.46కోట్ల నష్టాలను తగ్గించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో అధికారులు వెంకటరామిరెడ్డి, జోతి, సురేఖ, రవికుమార్, మారుతి. శ్రావణ్‌కుమార్‌పాల్గొన్నారు.