గద్వాల: ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగుల నిర్మూలన కోసం పిల్లలందరికీ అల్పండజోల్–400 ఎంజీ ట్యాబ్లెట్లను వేయించాలన్నారు. ఏడాది వయసు గల పిల్లలు మొదలుకుని 19ఏళ్ల వయసున్న పిల్లలకు తగిన మోతాదులో ట్యాబ్లెట్లను మింగించాలన్నారు. ఇందుకు సంబంధించి పాఠశాలలు, కళాశాలలో ముందస్తుగానే మందులను పంపిణీ చేయాలన్నారు. అదేవిధంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలలో ట్యాబ్లెట్లను ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా నిర్ధేశించిన మోతాదులో పంపిణీ చేయాలన్నారు. ట్యాబ్లెట్ల వల్ల ఏదేని దుష్ప్రభావాలు తలెత్తితే వెంటనే అవసరమైన వైద్యం అందించాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ట్యాబ్లెట్లు పంపిణీ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ధరూరు, గట్టు, క్యాతూర్ ప్రాంతాల్లో శిశు మరణాల సంఖ్య అధికంగా ఉందని ఇక్కడ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శిశుమరణాల కట్టడికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. శిశుమరణాలకు గల కారణాలు విశ్లేషిస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో ఒక్క శిశువు మరణించకుండా అన్ని రకాల అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ వినోద్, సంక్షేమ శాఖ జిల్లా అధికారి సునంద, మెడికల్ ఆఫీసర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment