గుండెపోటుతో అంగన్‌వాడీ ఆయా మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో అంగన్‌వాడీ ఆయా మృతి

Published Thu, Apr 6 2023 2:34 AM | Last Updated on Thu, Apr 6 2023 2:34 AM

- - Sakshi

గంపల్లి: మండలంలోని సూరంపాలెంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ఏరుపల్లి వెంకటలక్ష్మి (37) గుండెపోటుతో ప్రాణం విడిచింది. బుధవారం ఎప్పటిలాగే ఆమె విధులకు వెళ్లింది. చిన్నారులకు ఆహారపదార్ధాలను సిద్ధంచేసింది. గర్భిణులకు ఇమ్యూనైజేషన్‌ అనంతరం టిఫిన్‌ తినేందుకు సిద్ధపడింది. అదే సమయంలో ఒక్కసారిగా వాంతులవ్వడంతో అపస్మారకస్థితికి చేరింది. వెంటనే ఈమెను బంధువులు, తోటి సిబ్బంది పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. వెంకటలక్ష్మికి భర్త మూలబ్బాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

జీతాల జాప్యంపై

అధికారుల ఆరా

– సాక్షి కథనానికి స్పందన

కాకినాడ క్రైం: ‘మరీ ఇంత నిర్లక్ష్యమా...’ శీర్షికతో బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు డాక్టర్‌ వి.రామిరెడ్డి ఈ కథనంపై ఆరా తీశారు. ఏడు నెలలు గడిచినా జీతాలు చెల్లించకపోవడంపై ఆయన కార్యాలయ వర్గాలు కలెక్టరేట్‌, డీఎంహెచ్‌వో కార్యాలయ వర్గాల నుంచి శుక్రవారం వివరాలు సేకరించాయి. ఈ నిర్లక్ష్యం వెనుక డీఎంహెచ్‌వో ఉద్యోగుల పాత్రతో పాటు, పారామెడికల్‌ ఉద్యోగి కే.సూర్యచంద్ర డీఎంహెచ్‌వో కార్యాలయంలో కీలక ఏవో పోస్టులో కొనసాగడంపై ఆరా తీసి నివేదించాయి. ప్రస్తుత ఇంఛార్జి డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్న రోణంకి రమేషే డిప్యూటీ డెమోగా ఉన్న పారామెడికల్‌ ఉద్యోగి సూర్యచంద్రను ఇంఛార్జి ఏవో పోస్టు కోసం సిఫార్సు చేసి నియమించినట్ల్లు డీహెచ్‌ పరిశీలనలో తేలింది. ఈ విషయంపై డీహెచ్‌ డాక్టర్‌ రామిరెడ్డిని వివరణ కోరగా, ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు విడుదల చేసినా చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఏవో ప్రమోషన్ల ఫైల్‌ సిద్దమవుతుందని డాక్టర్‌ రామిరెడ్డి తెలిపారు. ఈ లోపు ఇంఛార్జి ఏవోను తొలగించి ఆ స్థానంలో ఆర్‌ఎంసీ లేదా జీజీహెచ్‌ ఏవోలకు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తామని డీహెచ్‌ అన్నారు.

నూకాలమ్మ హుండీ

ఆదాయం రూ.16.34 లక్షలు

పెద్దాపురం: పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి హుండీల ద్వారా 20 రోజులకు గాను సుమారు 16,34లక్షలు ఆదాయం సమకూరింది. ఆలయ కార్యనిర్వహణాధికారి తలాటం వెంకట సూర్యనారాయణ ఈ విషయం తెలిపారు. బుధవారం దేవదాయశాఖ తనిఖీ అధికారి చల్లా ఉదయ్‌బాబు సమక్షంలో హుండీలను లెక్కించారు. జెడ్పీటీసీ గవరసాని సూరిబాబు, ఆలయ చైర్మన్‌ గవరసాని వీరాస్వామి, గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ జోకా నానాజీ, ఎంపీటీసీ భద్రరావు, లక్కాకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జీజీహెచ్‌లో ఇద్దరికి కోవిడ్‌

కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో ఇద్దరికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ అయింది. ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే 31 ఏళ్ల మైక్రోబయాలజీ సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యురాలితో పాటు, 20 ఏళ్ల జీఎన్‌ఎం మూడవ సంవత్సరం విద్యార్థినికి కోవిడ్‌ సోకినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. మంగళవారం సేకరించిన 43 నమూనాలను పరీక్షిస్తే ఈ ఫలితం వెల్లడైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
హుండీల సొమ్ము లెక్కిస్తున్న మహిళలు 1
1/2

హుండీల సొమ్ము లెక్కిస్తున్న మహిళలు

వెంకటలక్ష్మి (ఫైల్‌)2
2/2

వెంకటలక్ష్మి (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement