ఐ.పోలవరం: అనుమానమే పెనుభూతమైంది.. ఇద్దరు మహిళలపై హత్యాయత్నానికి కారణమైంది.. ఐ.పోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలో ఈ దాడికి ఒడిగట్టిన నిందితుడు.. ఆపై భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై రాజేష్, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నిచ్చెనకోళ్ల రామకృష్ణ కొబ్బరి దింపు కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. అతడికి, మండపేటకు చెందిన యువతికి ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. ఇదిలా ఉండగా భార్యపై రామకృష్ణ కొన్నాళ్లుగా అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య శుక్రవారం ఉదయం నుంచీ అదే పనిగా ఎవరితోనో ఫోనులో మాట్లాడటం చూసి ఆగ్రహానికి గురయ్యాడు. విచక్షణ కోల్పోయిన అతడు.. కొబ్బరి దింపునకు ఉపయోగించే కత్తితో భార్యపై ఒక్కసారిగా దాడి చేశాడు. ఇదిలా ఉండగా కుమార్తెను చూసేందుకు ఆమె తల్లి (రామకృష్ణ అత్త) మేరీ రత్నం ఉదయం మండపేట నుంచి గుత్తినదీవి వచ్చింది. కుమార్తైపె దాడి చేస్తున్న క్రమంలో రామకృష్ణను మేరీ రత్నం అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో పట్టరాని ఆగ్రహానికి గురైన నిందితుడు మేరీ రత్నంపై కూడా కత్తితో దాడి చేశాడు. అనంతరం హత్యాయత్నానికి ఒడిగట్టానన్న విషయం స్ఫురణకు రావడంతో రామకృష్ణ భీతిల్లాడు. ఈ నేపథ్యంలో అతడు చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితి లో ఉన్న ముగ్గురినీ స్థానికులు 108లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ కూడా ఆసుపత్రి పాలవడంతో రామకృష్ణ చిన్నారులు బిక్కుబిక్కు మంటూ విలపిస్తున్నారు. ఎస్సై రాజేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఫ భార్య, అత్తపై కత్తితో దాడి
ఫ ఆపై భయంతో చీమల మందు తాగిన నిందితుడు
ఫ ముగ్గురికీ ఆసుపత్రిలో చికిత్స
Comments
Please login to add a commentAdd a comment