నాగమల్లితోట (కాకినాడ సిటీ): ఏపీ సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో బాలికల హాకీ విభాగంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టులోని క్రీడాకారిణులను కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) సీఈఓ షేక్ ఇమ్రాన్ ఆదివారం అభినందించారు. తిరుపతిలో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకూ ఈ పోటీలు జరిగాయి. ఇందులో విజయం సాధించిన హాకీ క్రీడాకారిణులు సీఈఓను, చీఫ్ కోచ్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఇమ్రాన్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. హాకీ కోచ్ రవిరాజు మాట్లాడుతూ, బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో డీఎస్ఏ చీఫ్ కోచ్ శ్రీనివాస్‌కుమార్, రాష్ట్ర వ్యాయామోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జార్జి, అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి రంగారావు, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి రెండో బ్యాచ్
మాస్టర్ ట్రైనీల శిక్షణ
సామర్లకోట: పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేందుకు గాను మాస్టర్ ట్రైనీల రెండో బ్యాచ్‌ను సోమవారం ప్రారంభిస్తున్నామని స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం (ఈటీసీ) మేనేజర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. మొదటి బ్యాచ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చామన్నారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లోని మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 10 మంది చొప్పున 40 మందికి మాస్టర్ ట్రైనీలుగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. వీరిలో ఆయా జిల్లాల్లోని సీనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఈఓ పీఆర్డీలు ఉన్నారని శ్రీనివాసరావు తెలిపారు.
ప్రజా సమస్యల సత్వర
పరిష్కారానికి కృషి
తొండంగి: పోలీసుల దృష్టికి తెచ్చిన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ అన్నారు. కోదాడ పంచాయతీ పంపాదిపేట గ్రామస్తులు సుమారు 200 మందితో ఆదివారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు విని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పలువురు చిన్నచిన్న సమస్యలు ప్రస్తావించగా.. వాటిని పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా జిల్లాలో నేరాలు తగ్గించి, యువతలో సత్ప్రవర్తన కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఒంటిమామిడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. రికార్డులు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తుని రూరల్ సీఐ సన్యాసిరావు, ఎస్సై ఎస్.రవికుమార్, ఏఎస్సై రాయవరపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 8 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,11,765, పూజా టికెట్లకు రూ.92,230, కేశఖండన ద్వారా రూ.14,075, వాహన పూజలకు రూ.6,740, కాటేజీల ద్వారా రూ.67,700, ఇతర విరాళాలుగా రూ.1,38,947 కలిపి మొత్తం రూ.4,31,457 ఆదాయం సమకూరిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment