పెద్దాపురం: మండలంలోని పులిమేరు శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వసతి గృహంలో పిల్లలకు అందిస్తున్న ఆహార పదార్థాలు, వసతులపై క్షుణ్ణంగా ఆరా తీసి, రికార్డులు తనిఖీ చేశారు. విభిన్న ప్రతిభావంతులకు సేవలందించడం వరమని, అటువంటి విద్యార్థులను సాకుతున్న పాఠశాల నిర్వాహకులు రాయవరపు వీరబాబు, సత్య దంపతులను అభినందించారు. పాఠశాల ఆవరణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని బీసీ బాలురు, బాలికల వసతి గృహంలో తనిఖీలు చేసి, విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూష, కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఏలేరు నీటిమట్టం
75.64 మీటర్లు
ఏలేశ్వరం: ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏలేరు రిజర్వాయర్‌లో నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. జలాశయం పరీవాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా అడపాదడపా వర్షాలు పడుతున్నా ఎండ తీవ్రతకు నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఏలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, ఆదివారం 75.64 మీటర్లుగా నమోదైంది. అలాగే, రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, 8.89 టీఎంసీలుగా రికార్డయ్యింది. దిగువన సాగు చేపట్టడంతో ఆయకట్టుకు 400, విశాఖకు 200, తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రతి మంగళవారం
డయల్ యువర్ కలెక్టర్
కాకినాడ సిటీ: ఇక నుంచి ప్రతి మంగళవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ శ్రీడయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కలెక్టర్ కృతికా శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఇప్పటి వరకూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తుండగా.. దీనిని మంగళవారానికి మార్చారు. ప్రజలు తమ సమస్యలను టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 3077కు ఫోన్ చేసి నేరుగా తనకు తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం యథావిధిగా ప్రతి సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి జరుగుతుందని కృతికా శుక్లా తెలిపారు.
కిక్కిరిసిన లోవ దేవస్థానం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ఆదివారం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆషాఢ మాసం రెండో ఆదివారం కావడంతో అమ్మవారిని పండితులు గులాబీలు, చామంతి, మల్లెలు, కనకంబరాలు తదితర పూలతో ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శనాలు కల్పించారు. పూలతో ఆలయాన్ని సైతం వైభవోపేతంగా అలంకరించారు. అమ్మవారిని 40 వేల మంది దర్శించారని ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ప్రత్యేక దర్శనానికి అరగంట, ఉచిత దర్శనానికి గంట సమయం పట్టింది. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,58,350, పూజా టికెట్లకు రూ.3,71,920, కేశఖండన శాలకు రూ.41,320, వాహన పూజలకు రూ.4,850, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెల రూపేణా రూ.1,17,952, విరాళాలుగా రూ.1,97,390 కలిపి మొత్తం రూ.10,91,783 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. వసతి గదులు లభించని భక్తులు లోవ ప్రాంగణంలోని చెట్ల కింద, ఉచిత షెడ్లు, ఘాట్ రోడ్డు దిగువన ప్రైవేటు కాటేజీలు, తాటాకు పాకల్లో వసతి ఏర్పాటు చేసుకుని వంటలు, భోజనాలు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు భారీ వర్షం కురవడంతో ఇబ్బందులకు గురయ్యారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తలుపులమ్మ అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment