ఏలేశ్వరం: కొద్ది రోజులుగా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు స్వల్పంగా పెరిగాయి. జలాశయంలోకి ఆదివారం 800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, ప్రస్తుతం 76.02 మీటర్లుగా నమోదైంది. సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను 9.24 టీఎంసీల మేర నీటినిల్వలున్నాయి. ఆయకట్టుకు 600, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
చీలిక పెదవి శస్త్రచికిత్సలు పూర్తి
కాకినాడ క్రైం: మిషన్ స్మైల్ ఆధ్వర్యాన ముత్తూట్ పపాచన్ సహకారంతో కాకినాడ జీజీహెచ్‌లో నిర్వహించిన చీలిక పెదవి శస్త్రచికిత్సలు ఆదివారం ముగిశాయి. మలిదశలో భాగంగా జరిగిన ఈ మూడు రోజుల ప్రక్రియలో మొత్తం 34 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలతాదేవి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ విష్ణువర్ధన్ల పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్సలు చేశారు. ఆదివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం అతిథిగా పాల్గొన్నారు. మిషన్ స్మైల్ బృందాన్ని అభినందించారు. తిరుపతి, విజయనగరం ఆస్పత్రుల్లో కూడా చీలిక పెదవి శస్త్రచికిత్సలు నిర్వహించాలని కోరారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వందలాది మంది బాలల జీవితాలు వికసిస్తాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్లాస్టిక్ సర్జరీ, అనస్థీషియా నిపుణులతో పాటు మిషన్ స్మైల్ వైద్య బృందం, బాలల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వాహనాల విడిభాగాలకు 2న వేలం
కాకినాడ క్రైం: పాడయిన ప్రభుత్వ పోలీసు వాహనాల విడిభాగాల విక్రయానికి వచ్చే నెల 2వ తేదీన బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) అదనపు ఎస్పీ సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ఆవరణలో ఈ వేలం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఆ రోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు మోటార్ ట్రాన్స్‌పోర్టు అధికారి ఆర్ఐ అప్పారావును 94407 96553 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు.
నేడు స్పందన
కాకినాడ సిటీ: జగనన్నకు చెబుదాం, జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి కలెక్టరేట్లో నిర్వహిస్తున్నారు. కలెక్టర్ కృతికా శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అలాగే మంగళవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యలను 1800 425 3077 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తనకు నేరుగా తెలియజేయవచ్చని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment