ఇటీవల యనమల రామకృష్ణుడిని కలసిన సత్యప్రభ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కలసి ఉన్నట్టే కనిపించిన తమ్ముళ్లు ఒక్కసారిగా కత్తులు దూస్తున్నారు.. పార్టీపై పెత్తనం కోసం మూడు గ్రూపులు.. ఆరు ముఠాలు అన్నట్టు కాలు దువ్వుతున్నారు.. సరి చేయాల్సిన జిల్లా నేతలు సైతం అసమ్మతి కుంపట్లను మరింతగా రాజేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరిపాకాన పడింది. నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల రాజా హఠాన్మరణం తరువాత ఆయన భార్య సత్యప్రభను ఆ స్థానంలో నియమించారు.
ఆ బాధ్యతలు తీసుకున్న సత్యప్రభ నియోజకవర్గ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో నేతలంతా కలసి ఉన్నట్టే పైకి కనిపించారు. రెండు నెలలు గడిచేసరికి గతంలో రాజాపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేతలు.. ఇప్పుడు సత్యప్రభ లక్ష్యంగా అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. పార్టీలో ఆమెను ఏకాకిని చేయడం ద్వారా పొమ్మనకుండానే పొగబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది.
బొత్తిగా కొత్త అయిన సత్యప్రభ ఈ రాజకీయాలకు బెదిరిపోయి తనంత తానే తప్పుకుంటారనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా అసమ్మతి రాజేస్తున్నారని పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజకీయాలు ఇలానే కొనసాగితే ఇన్‌చార్జి పదవి నుంచి వైదొలగడమే పరిష్కారమనే భావన ఆమెకు కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
రాజా మరణానికి ముందు నుంచే..
వరుపుల రాజా హఠాన్మరణానికి ఏడాది ముందు నుంచే పైలా బోస్ వర్గం ఆయనపై అసమ్మతి వెళ్లగక్కుతూ వచ్చింది. ఇన్‌చార్జిగా రాజాను తొలగించాలంటూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బోస్ వర్గం హోర్డింగ్‌లు పెట్టింది. దీనిపై ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే నాడు భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. రాజాను తొలగించాలని ధర్నా చేయడం, పార్టీలో కొందరు పెద్దలు తెర వెనుక ఉండి అసంతృప్తిని ఎగదోయడంతో రాజా మానసిక వేదనకు గురై హఠాన్మరణం చెందారనే చర్చ అప్పట్లో పార్టీ వర్గాల్లో జరిగింది. రాజా మరణానంతరం ఆయన భార్య సత్యప్రభకు ఇన్‌చార్జి పదవి ఇవ్వడాన్ని అసమ్మతి వర్గం ఏ కోశానా ఆమోదించడం లేదు. సరికదా బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి.
ఆమె వల్ల కాదంటూ..
► రాజకీయాలకు కొత్త.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సత్యప్రభతో పార్టీని నడిపించడం సాధ్యం కాదనే వాదనను ఆమె వ్యతిరేక వర్గాలు తెర మీదకు బలంగా తీసుకువస్తున్నాయి. ఇదే వాదనను వారు పార్టీ ముఖ్య నేతలకు వినిపించారని సమాచారం. ఆమెను తప్పించి అన్ని విధాలా సమర్థులైన వారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని వ్యతిరేక వర్గం గట్టి పట్టుదలతో ఉంది. దీని వెనుక పార్టీ ముఖ్యులున్నారనే ప్రచారం ఉంది.
► ఇటీవల ఏలేశ్వరంలో రాజా వర్గానికి చెందిన పలివెల శ్రీనుపై బోస్ వర్గీయులు చేయి చేసుకున్న వ్యవహారం పోలీసు స్టేషన్ వరకూ వెళ్లింది. రౌతులపూడి మండలం జెడ్పీటీసీకి పోటీ చేసి, ఓటమి పాలైన గంటా గోపి.. అదే మండలానికి చెందిన టీడీపీ నాయకుడు, రాజా వర్గీయుడైన సోమరౌతు చంద్రమౌళిని బహిరంగంగానే చెప్పుతో కొట్టారు. చంద్రమౌళిని జ్యోతుల నవీన్, సత్యప్రభ పరామర్శించారు.
► గోపీని సస్పెండ్ చేయాలని మౌళి సహా రాజా వర్గీయులు పలువురు పట్టుబట్టినా యనమల వర్గం అడ్డుపడిందని అంటున్నారు.
► తనను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన సత్యప్రభపై చంద్రమౌళి వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
► శంఖవరం మండలంలో కొంతమంది నాయకులు యనమల కృష్ణుడికి మద్దతుగా ఉంటూ వ్యతిరేక ప్రచారం చేస్తూండటం సత్యప్రభకు తలనొప్పిగా మారింది.
► యనమల వర్గంగా ముద్రపడిన టీడీపీ శంఖవరం మండల అధ్యక్షుడు బద్ది రామారావు తమ వారిని దూరం పెడుతున్నారని సత్యప్రభ వర్గం కారాలూ మిరియాలూ నూరుతోంది. ఆమెకు వ్యతిరేకంగా ముదునూరి మురళీకృష్ణంరాజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక రామారావు పాత్ర ఉందని అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఇదంతా యనమలకు తెలిసే జరుగుతోందని అంటున్నారు.
► ఏలేశ్వరంలో పార్టీ ఉనికి కోల్పోవడానికి పైల బోస్ తీరే కారణమంటూ సత్యప్రభ ఆ వర్గాన్ని దూరం పెట్టింది. దీంతో ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు తారస్థాయికి చేరాయి.
► సొంత నియోజకవర్గాల్లో చేతులెత్తేసిన యనమల రామకృష్ణుడు (తుని), ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ (పిఠాపురం) ప్రత్తిపాడులో వేలు పెట్టి టీడీపీలో వర్గ విభేదాలకు కారకులవుతున్నారని సత్యప్రభ వర్గీయులు మండిపడుతున్నారు.
► సత్యప్రభ ప్రాతినిధ్యం విషయంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ సానుకూలంగా ఉండటం యనమల, వర్మ వర్గీయులకు రుచించడం లేదు. నెహ్రూ, యనమల మధ్య పార్టీ ఆవిర్భావం నుంచీ విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
► పిఠాపురం సీటును ఈసారి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న సామాజికవర్గానికి ఇవ్వాలనే వాదనను జ్యోతుల నవీన్ తెర మీదకు తీసుకువచ్చారు. అప్పటి నుంచీ మాజీ ఎమ్మెల్యే వర్మతో విభేదాలు పొడచూపాయి. ఇందుకు ప్రతిగా కాకినాడ పార్లమెంట్ స్థానంపై నవీన్ పెట్టుకున్న ఆశలపై యనమల సాయంతో నీళ్లు చల్లేందుకు వర్మ ప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచీ వర్మను జ్యోతుల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇన్ని విభేదాల మధ్య చివరి వరకూ సత్యప్రభ ఇన్‌చార్జిగా కొనసాగుతారా లేక మధ్యలోనే కాడి వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిందే.
సై అంటున్న మరో వర్గం
ఇదిలా ఉండగా ఇటీవలే సైకిల్ ఎక్కిన ముదునూరి మురళీకృష్ణంరాజు మరో వర్గంగా అసమ్మతి కార్యకలాపాలకు సై అంటున్నారు. శంఖవరం మండలం అన్నవరం సహా ప్రతిపాడు తదితర ప్రాంతాల్లో వ్యక్తిగతంగా మురళీకృష్ణంరాజు ఫొటోలతో ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడాన్ని రాజా వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. కార్యకర్తల్లో అయోమయం సృష్టించేందుకు కావాలనే ఇలా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఈ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. విభేదాల నేపథ్యంలో సత్యప్రభ ఇటీవల మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment