బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): డీసీసీబీలో సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేస్తే అదనపు వడ్డీ ఇవ్వనున్నట్లు చైర్మన్ ఆకుల వీర్రాజు తెలిపారు. డీసీసీబీ కార్యాలయంలో కొత్తగా ప్రవేశపెట్టిన గౌతమి రికరింగ్ డిపాజిట్ పథకం, రైతునేస్తం రుణ పథకం బ్యానర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. గౌతమి రికరింగ్ డిపాజిట్ పథకంలో ఇతరులకు 7.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.10 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నామని చెప్పారు. ఈ పథకం సెప్టెంబర్ 9వ తేదీ వరకూ మాత్రమే ఉంటుందన్నారు. రైతునేస్తం పథకం ద్వారా ఎకరా భూమి ఉన్న రైతుకు రూ.8 లక్షల రుణం ఇస్తామన్నారు. ఒక రైతుకు గరిష్టంగా రూ.36 లక్షల వరకూ రుణం ఇస్తామని చెప్పారు. దీనిపై వడ్డీ 12 శాతం మాత్రమేనన్నారు. రైతులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీర్రాజు కోరారు.
శతాధిక వృద్ధుడి మృతి
ముమ్మిడివరం: పట్టణ శివారు అగ్రహారానికి చెందిన శతాధిక వృద్ధుడు కట్టా కృష్ణమూర్తి (101) వృద్ధాప్యంతో మంగళవారం మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమా ర్తెలు, 15 మంది మనవలు, మునిమనవలు ఉన్నారు.
కట్నకానుకల చదివింపు పునరుద్ధరణ
అన్నవరం: నిత్య కల్యాణంలో సత్యదేవునికి, అమ్మవారికి భక్తులు సమర్పించే కట్న కానుకలు చదివించే పద్ధతిని పునరుద్ధరించారు. నిత్య కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్లకు భక్తులు కట్న కానుకలు సమర్పించడం చాలా కాలం నుంచే ఉంది. దీనిని ఇటీవల కొంత కాలంగా నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న ఈఓ చంద్రశేఖర్ ఆజాద్.. స్వామివారి కల్యాణం అనంతరం భక్తుల కట్న కానుకలు స్వీకరించి, రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో భక్తులు సమర్పించిన కట్న కానుకలను పండితులు రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు మైకులో ప్రకటిస్తున్నారు. ఆది, సోమవారాల్లో రూ.1,538, రూ.1,618 కట్న కానుకల రూపంలో వచ్చినట్టు జమ చేశారు. సోమవారం రూ.1,118 కట్న కానుకలు సమర్పించినట్లు వేద పండితులు యనమండ్ర శర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు మైకులో ప్రకటించారు. స్వామి, అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్న వస్త్రాలను కూడా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment