పిఠాపురం: గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలో సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్యులు స్థానికులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఇదిలాఉంటే ఆ ప్రాంతానికి చెందిన వెంకట్రావుకు బీపీ తగ్గిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉన్న డాక్టర్ రవికుమార్ హుటాహుటిన అస్వస్థతకు గురైన వ్యక్తి వద్దకు వెళ్లి వైద్య సేవలు అందించారు. దీంతో ఆయన కోలుకోవడంతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
రంగంపేట: పీడీఎస్ బియ్యాన్ని సోమవారం విజిలెన్స్, రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు పట్టుకున్నారు. రీజినల్ విజిలెన్స్ ఇన్చార్జి ఎస్పీ కె.కుమార్ కథనం ప్రకారం.. రంగంపేట మండలం ఈలకొలను గ్రామ సమీపంలో లారీలో రేషన్ బియ్యం రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ లారీని తనిఖీ చేయగా 713 ప్లాస్టిక్ బస్తాల్లో సుమారు 35,660 కిలోల బియ్యాన్ని గుర్తించారు. దీని విలువ రూ. 54,26,400గా నిర్ధారించారు. పీడీఎస్ బియ్యం గుంటూరుకు చెందిన సామ కార్తీక్ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలోని బుచ్చయ్యనగర్కు చెందిన లారీ డ్రైవర్ నల్లశెట్టి మురళీకృష్ణ మచిలీపట్నం నుంచి తరలిస్తున్నట్టు తెలిపారు. బియ్యం రవాణాకు సంబంధించి సరైన బిల్లులు లేనందున సివిల్ సప్లయిస్ అధికారులు లారీని, బియ్యాన్ని సీజ్ చేసి 6ఏ కేసు నమోదు చేసి లారీ డ్రైవర్, బియ్యం యజమాని, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు కోసం రంగంపేట పోలీసులకు సిఫారసు చేశారు. తనిఖీల్లో కార్యాలయ సబ్ఇన్స్పెక్టర్ జగన్నాథరెడ్డి, జియాలజిస్టు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment