కాకినాడ రూరల్: సర్పవరం జంక్షన్‌లో సోమవారం జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. విభిన్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సామాజిక సాధికారతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాధ్యం చేసి చూపారని అన్నారు. ఈ కృషిని వివరించేందుకే బస్సు యాత్ర జరుగుతోందని చెప్పారు. జిల్లాలో తొలిసారిగా రూరల్ నియోజవర్గంలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సారథ్యంలో జరిగే ఈ బహిరంగ సభలో అన్ని వర్గాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.
లోవ దేవస్థానంలో భక్తుల రద్దీ
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ ఏర్పడింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,60,455, పూజా టికెట్లకు రూ.1,87,650, కేశఖండన శాలకు రూ.11,200, వాహన పూజలకు రూ.3,950, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలుగా రూ.89,056, విరాళాలుగా రూ.2,07,437 కలిపి అమ్మవారికి మొత్తం రూ.6,59,698 ఆదాయం సమకూరిందని వివరించారు. శ్రీవారి సేవకులు, సిబ్బందితో కలసి భక్తుల సౌకర్యాలను ఈఓ విశ్వనాథరాజు పర్యవేక్షించారు.
నేడు యథావిధిగా స్పందన
కాకినాడ సిటీ: జగనన్నకు చెబుదాం, జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుంది. కలెక్టర్ కృతికా శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అర్జీదారులు, జిల్లా అధికారులు దీనిని గమనించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment