కాకినాడ సిటీ: ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా ఎన్నికలు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ఈవీఎం, వీవీప్యాట్ గోదామును రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రతకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి నెలా ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్టు కృతికాశుక్లా వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలిస్తామని వివరించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు, గదుల సాయిబాబా, సబ్బారపు అప్పారావు, సీహెచ్ రమేష్‌బాబు, టీవీఆర్ సాచి, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఐటీ జిల్లా అధ్యక్షురాలిగా కృష్ణప్రియ
కాకినాడ: వైఎస్ఆర్సీసీపీ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షురాలిగా బీర కృష్ణప్రియ నియమితులయ్యారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఈమేరకు ఈ నియామకాన్ని ప్రకటించింది. మహిళలపై లైంగిక వేధింపుల నియంత్రణ కమిటీ (పోష్) కమిటీ సభ్యురాలిగా కూడా కృష్ణప్రియ పనిచేస్తున్నారు. విద్యావంతురాలైన కృష్ణప్రియ పార్టీ కార్యకలాపాల్లో చురుకై న పాత్ర వహిస్తున్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సిఫార్సు మేరకు ఈ నియామకాన్ని ప్రకటించారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తానని కృష్ణప్రియ పేర్కొన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. తన నియామకం కోసం సిఫార్సు చేసిన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు,సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు ఆమె ధన్యవాదాలు చెప్పారు.
నేడు రత్నగిరిపై పలు భవనాల ప్రారంభం
తొండంగి: అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులను దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం ప్రారంభించనున్నట్టు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి సోమవారం తెలిపారు. కొండపై శివసదన్ సత్రం, సత్యనారాయణ యాత్రీనివాస్, సత్యేశ్వరనివాస్, విద్యుత్ శంఖు చక్రనామాలు, వనదుర్గ మార్గ్, సత్యదేవ సర్వీస్ రోడ్డు, విశ్రాంతి భవనం, ఆది శంకర మార్గ్, హరిహర మార్గ్‌లను మంత్రి సత్యనారాయణ ప్రారంభిస్తారని వివరించారు. ఈ సందర్భంగా సిబ్బంది వారంతపు సెలవు పెట్టేందుకు అనుమతులు ఇవ్వలేదన్నారు.
బంగారు పతక విజేతకు ప్రశంసలు
కాకినాడ సిటీ: థాయిలాండ్‌లో ఈనెల 1 నుంచి 9వతేదీ వరకు జరిగిన ప్రపంచ డిజేబుల్ స్పోర్ట్స్‌లో జిల్లా నుంచి అథ్లెటిక్స్ విభాగంలో ఇండియా తరపున మహిళల జావెలెన్ త్రో అండ్ డిస్కస్ త్రోలో ప్రతిభ కనబరిచిన గాలిదేవర శివగంగా దుర్గా సోమవారం కలెక్టర్ కృతికా శుక్లాను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాకినాడ జిల్లా నుంచి దేశం తరపున ప్రాతినిధ్యం వహించడమే కాకుండా బంగారు పతకం గెలిచినందుకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా డిజేబుల్ వెల్ఫేర్ అధికారి నారాయణమూర్తి, జిల్లా డిజేబుల్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్ తదితరులు శివగంగా దుర్గను అభినందించిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment