●
మరింత అవార్డులు సాధిస్తాం
ఇప్పటికే ఉప్పాడ జాంధానీ చీర చాలా ఘనత సాధించింది. ఇది కేవలం మా కార్మికుల కళా నైపుణ్యమే. ఎన్ని అవార్డులు సాధించినా ఇంకా సాధించాలనే తపనతో నేతలో సరికొత్త నైపుణ్యం కోసం తపన పడుతున్నాం. తద్వారా మరింత అందమైన జాంధానీ చీరలు తయారు చేస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వమూ ఆదుకోక, ఆర్థిక భారంతో నేత నేయలేని దుస్థితిలో ఉన్న మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేయూతనిచ్చారు. మాకు, చేనేతకు పునర్జన్మనిచ్చారు. అందుకే మరింత ముందుకు వెళుతున్నాము. కరోనా వంటి కష్ట సమయంలో ప్రభుత్వం ఆదుకున్న తీరు మాలో నూతన ఉత్సా హాన్ని నింపింది. మరిన్ని అవార్డులు సాధించడానికి శాయశక్తులా కృషి చేస్తాం.
– రాంబాబు,
చేనేత కార్మికుడు, ఉప్పాడ, యు.కొత్తపల్లి మండలం
జాంధానీతో చేనేతకు గుర్తింపు
ఉప్పాడలో జాంధానీ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. భారతీయ చేనేత గర్వపడేలా ఇక్కడ జాంధానీ చీరలు తయారవుతున్నాయి. తాజాగా దీనికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తిలో భాగంగా దీనిని ఎంపిక చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షించేలా ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపట్టింది.
– కూరెళ్ల పెద్దిరాజు, జిల్లా చేనేత,
జౌళి శాఖ అధికారి, కాకినాడ
● జాతీయ స్థాయిలో
ఉప్పాడ కీర్తిపతాక రెపరెపలు
● జాంధానీ చీరలకు అరుదైన గౌరవం
● వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్టు విభాగంలో
బంగారు పతకం
● ఉత్పత్తి, వ్యాపారం మరింతగా
పెంచేందుకు అధికారుల యోచన
పిఠాపురం: బంగాళాఖాతంలో తుపాను వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టీ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ గ్రామం మీదనే ఉంటుంది. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో ఛిద్రమైపోయే ఇక్కడి తీరం, బీచ్ రోడ్డు చిత్రాలే మీడియాలో కనిపిస్తూంటాయి. గంగపుత్రులతో పాటు విభిన్న సామాజికవర్గాల వారు నివసిస్తున్న ఈ సాగర తీర గ్రామం.. తన జాంధానీ చీరల కళానైపుణ్యంతో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక్కసారిగా బంగారంలా తళుక్కున మెరిసింది.
వ్యవసాయేతర విభాగంలో..
ఇప్పటికే అనేక పర్యాయాలు ఉప్పాడ జాంధానీ చీరకు గుర్తింపు రాగా, తాజాగా జాతీయ స్థాయిలో పసిడి పతకం వరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ పోటీలో ఉప్పాడ జాంధానీ చీరలు ఈ ఘనతను సాధించడం విశేషం. ఈ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వం టెక్స్‌టైల్స్, హస్తకళ, చేనేత, మత్స్య, పారిశ్రామిక రంగాల్లో 14 ఉత్పత్తులను ఎంపిక చేయగా.. వాటిలో మన రాష్ట్రానికి ఆరు పతకాలు లభించాయి. వీటిలో ఉప్పాడ చేనేత కార్మికుల కళాసృష్టి అయిన జాంధానీ చీరకు వ్యవసాయేతర విభాగంలో బంగారు పతకం లభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్–2024 వేడుకల్లో కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా కలెక్టర్ కృతికా శుక్లా తరఫున జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి కూరెళ్ల పెద్దిరాజు ఈ అవార్డు అందుకున్నారు.
జాంధానీ.. అద్భుత కళాసృష్టి
అగ్గిపెట్టెలో పట్టేంత చీరను అత్యంత నైపుణ్యంతో నేసిన ఘనత కలిగిన చేనేత కార్మికులు మన సొంతం. వస్త్ర పరిశ్రమలో తమదైన నైపుణ్యాన్ని ఉప్పాడ నేతకారులు ప్రదర్శిస్తూ, మహిళల మనసులను దోచుకుంటున్నారు. వీరి అద్భుత సృష్టి జాంధానీ చీర. చీరలన్నింటిలోకీ ఈ జాంధానీ చీర విభిన్నంగా ఉండటంతో దీనికి ఎనలేని కీర్తిప్రతిష్టలు వచ్చాయి. వెండి, బంగారు జరీలతో, పట్టు నూలుపై రెండువైపులా ఒకేలా ఉండేలా జాంధానీ చీరలను ఇక్కడి కార్మికులు తయారు చేస్తారు. వీటికి గిరాకీ చాలా ఎక్కువ. 1983లో ఇక్కడ జాంధానీ చీరల తయారీ ప్రారంభమైంది. ఒరిజనల్ జాంధానీ చీర ఖరీదు రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ ఉంటుంది. ఒక చీర నేయడానికి నలుగురు మనుషులు అవసరమవుతారు. జాంధానీ చీరలపై నేసే డిజైన్లు ఎంతో కళాత్మకంగా ఉంటాయి. చిలుక, హంస, నెమలి వంటి అనేక రకాల డిజైన్లు ఈ చీరలపై రూపుదిద్దుకుంటున్నాయి. ఎక్కువ డిజైన్ల వల్లనే ఈ చీరల నేత కష్టంగా ఉంటుంది. నిత్యం ఇద్దరి నుంచి ఐదుగురు కార్మికులు పని చేస్తే 20 నుంచి నెల రోజుల్లో అందమైన జాంధానీ చీర తయారవుతుంది. ఈ చీర నేయడానికి ముందు గ్రాఫ్ ఆధారంగా డిజైన్లు తయారు చేస్తారు. ఇది ఒక్క ఉప్పాడ ప్రాంత చేనేత కార్మికులకే సొంతమైన కళా నైపుణ్యమని చెప్పవచ్చు. ఏటా సుమారు రూ.10 కోట్ల మేర ఇక్కడ జాంధానీ చీరల వ్యాపారం జరుగుతుంది. దేశ విదేశాల నుంచి ఆన్‌లైన్‌లో సైతం ఆర్డర్లు వస్తూండటం విశేషం.
రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో..
రాష్ట్రంలో చేనేతను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శద్ధ్ర చూపడంతో.. కనుమరుగవుతోందనుకున్న జాంధానీ చీరల తయారీకి పూర్వ వైభవం వచ్చింది. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.24 వేల సాయం అందిస్తోంది. దీంతోపాటు రూ.3 వేల పింఛన్ సైతం అందిస్తున్నారు. నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ) ద్వారా నేత కార్మికులకు రాయితీతో కూడిన నూలు సమకూరుస్తున్నారు. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా దుస్తుల ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు క్రెడిట్ సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న వినూత్న పథకాలతో తమ ఆర్థిక ఇబ్బందులు సమసిపోయి, చీరల తయారీలో ముందడుగు వేస్తున్నామని చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖండాంతర ఖ్యాతి
ఇప్పటికే ఉప్పాడ కాటన్, సిల్క్‌కు గతంలో పేటెంట్ హక్కు లభించింది. ఇండియన్ హ్యాండులూమ్స్‌లో ప్రముఖ స్థానం సంపాదించింది. ఉప్పాడ జాంధానీ చీరల డిజైన్లతో తపాలా శాఖ ప్రత్యేకంగా కవరు కూడా విడుదల చేసింది. తాజా పసిడి పతకంతో జాంధానీ చీరల ఘనత ఖండాంతరాలకు మరింతగా విస్తరించనుంది. గతంలో ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో జాంధానీ చీరలు ప్రత్యేక గుర్తింపు సాధించడంతో ఇప్పటికే విదేశాల నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా జాంధానీ చీరల ఉత్పత్తిని పెంచేందుకు, తద్వారా ఉప్పాడ చేనేత కార్మికుల ఆర్థిక వికాసానికి అవసరమైన సదుపాయాల విస్తరణకు సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పెరుగుతున్న ఉత్పత్తి
నానాటికీ గిరాకీ పెరుగుతూండటంతో ఉప్పాడలో జాంధానీ చీరల ఉత్పత్తి కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ గతంలో రోజుకు ఒకటి రెండు చీరలకు మించి తయారయ్యేవి కావు. అటువంటిది ప్రస్తుతం 50 నుంచి 100 చీరల వరకూ తయారు చేస్తున్నారు. ఉప్పాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ చూసిన జాంధానీ చీరల మగ్గాలు పెరిగిపోయాయి. కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, వాకతిప్ప, అమీనాబాద్, ఉప్పాడ, మూలపేట తదితర గ్రామాల్లో గతంలో 50 వరకూ ఉండే మగ్గాలు నేడు 500 వరకూ చేరుకున్నాయి. వృత్తితో సంబంధం లేకుండా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు జాంధానీ చీరలు తయారు చేస్తున్నారు. చిన్న పిల్లలు సైతం జాంధానీ చీరల తయారీలో ఆరితేరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment