కరుణించిన వరుణుడు | Sakshi
Sakshi News home page

కరుణించిన వరుణుడు

Published Sat, May 25 2024 3:40 PM

కరుణి

జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వాన

లోతట్టు ప్రాంతాలు జలమయం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రోహిణీ కార్తె వచ్చేస్తుంది.. వేడిగాలులు, ఎండ తీవ్రత ఏవిధంగా ఎదుర్కొనాలనుకుంటూ ఆందోళన చెందుతున్న ప్రజలపై వరుణుడు హఠాత్తుగా కరుణ వర్ష ధారలు కురిపించాడు. శనివారం నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానున్న తరుణంలో.. తీవ్ర ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జిల్లా ప్రజలకు శుక్రవారం కాస్త ఊరట లభించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వేడిగాలులు, ఉక్కపోతతో అవస్థలు పడిన జనం.. హోరున వర్షం కురవడంతో ఒక్కసారిగా సేద తీరారు. సుమారు మూడు గంటలకు హోరుగాలి, ఉరుములతో మొదలైన వర్షం సాయంత్రం 4.30 అయినా కురుస్తూనే ఉంది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏప్రిల్‌ మొదటి వారం నుంచే 36 డిగ్రీలు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు.. మే మొదటి వారంలో 40 డిగ్రీలకు పైగా చేరడంతో అల్లాడిపోయారు. ఉదయం పది గంటలు దాటితే బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇటువంటి తరుణంలో ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. సాయంత్రం నుంచి రాత్రి వరకూ చిలు జల్లులు పడుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కాకినాడతో పాటు తుని, అన్నవరం, పిఠాపురం, జగ్గంపేట, సామర్లకోట తదితర ప్రాంతాల్లో హోరున వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వీచిన పెను గాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కాకినాడలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు చెట్లు నేలకు ఒరిగిపోవడం వలన కూడా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నేలకొరిగిన చెట్లను ఆ శాఖ సిబ్బంది తొలగించి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు.

మామిడి రైతుకు తప్పని అవస్థలు

పెను గాలుల తాకిడికి పెద్దాపురం, జగ్గంపేట, శంఖవరం, తుని, కోటనందూరు వంటి ప్రాంతాల్లో మామిడి కాయలు నేల రాలిపోవడంతో రైతులు డీలా పడ్డారు. తయారైన మామిడి కాయలు కోసి, మార్కెట్‌కు తరలిద్దామనుకున్న తమ ఆశలు అడియాసలయ్యాయని వారు గగ్గోలు పెడుతున్నారు.

కరుణించిన వరుణుడు
1/1

కరుణించిన వరుణుడు

Advertisement
 
Advertisement
 
Advertisement