ఎన్నికల షెడ్యూల్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల షెడ్యూల్‌

Published Thu, Jan 30 2025 2:30 AM | Last Updated on Thu, Jan 30 2025 2:30 AM

ఎన్ని

ఎన్నికల షెడ్యూల్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మండలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగనున్న ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐ.వి) పదవీ కాలం వచ్చే మార్చి 29తో ముగియనుంది. ఖాళీ కానున్న ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చేసింది. ఎన్నికలకు వచ్చే నెల 3న నోటిఫికేషన్‌ వెలువడనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వీ నియమితులయ్యారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారని మొదటి నుంచి అనుకుంటున్నారు. కానీ ఏలూరు కలెక్టర్‌ ఆర్‌ఓగా నియమితులయ్యారు. ఆర్వో పరిధిలో ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు(ఏఆర్‌ఓ)గా ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. నామినేషన్‌లు మొదలు పోలింగ్‌, ఓట్ల లెక్కింపు వరకు అన్నింటినీ ఆర్వోగా నియమితులైన ఏలూరు జిల్లా కలక్టర్‌ వెట్రిసెల్వీ పర్యవేక్షించనున్నారు.

ధనబలంతో ముందుకు...

సహజంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాలని ప్రతి గ్రాడ్యుయేట్‌ ఆశిస్తాడు. కానీ ఈసారి అందుకు పూర్తి భిన్నంగా రాజకీయం, ధనబలంతో ముడిపడే ఎన్నికలుగా మార్చేశారు. ఇందుకోసం మూడు నెలలు ముందు నుంచే ఎక్కడికక్కడ పార్టీ నేతల ద్వారా పట్టభద్రుల ఓటర్ల నమోదు కోసం పెద్ద క్యాంపెయిన్‌ నిర్వహిస్తూ వస్తున్నారు. మండల, గ్రామాల వారీగా పార్టీ నేతలతో మాట్లాడించి ఓట్ల నమోదు చేయించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయంగా కలుషితం చేశారని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. ఈ ఎన్నికలలో అధికార పార్టీలో కూటమి తరఫున పోటీ చేసేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్‌ ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. పార్టీ అభ్యర్థినైతే కూటమి ప్రకటించేసింది. కానీ ఆ ప్రకటన చేసిన దగ్గర నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నేతలకు భయం వెంటాడుతోంది.

ప్రజా వ్యతిరేకత కొంప ముంచుతుందా?

సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఆర్భాటంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. కూటమి నేతలు చెప్పిన మాటలు వాస్తవ రూపం దాల్చుతాయనే నమ్మకంతో ప్రజలు ఓటేసి గద్దె నెక్కించారు. అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడు నెలలు గడచిపోయినా 99 శాతం హామీలను అటకెక్కించేశారు. చివరకు సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయలేమంటూ చంద్రబాబే స్వయంగా చేతులెత్తేసి నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అడ్రస్సే లేకుండా చేశారు. తల్లికి వందనం ఊసే లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి మాటే లేకుండా చేశారు. మహిళలను ఉచిత బస్సు ఎక్కించనే లేదు. రైతులకు పెట్టుబడి సాయం మాట నిలబెట్టుకోలేదు. ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మంది ఆడపిల్లలకు ప్రతి నెలా రూ.1,500 ఖాతాలో వేస్తానని చెప్పి దగా చేశారు. గ్రామ, వార్డు వలంటీర్లకు తిరిగి ఉద్యోగాలు కల్పించి రూ.5,000 ఉన్న వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని చెప్పుకొచ్చారు. ఏరు దాటాక ఓడ మల్లన్నను బోడి మల్లన్న అన్నట్టు గద్దె నెక్కాక చంద్రబాబు హామీల్లో ఒక్క పింఛన్‌ పెంపు తప్ప మరే ఒక్క హామీని అమలు చేయలేదు. పింఛన్‌ నగదు పెంచారు తప్పితే ఇప్పుడు పునఃపరిశీలన అంటూ పింఛన్‌ల సంఖ్యను కుదించేసే ఎత్తులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చేతిలో సొమ్ము లేక ఉమ్మడి తూర్పులో ప్రజలు సంక్రాంతి పండగ కూడా సాదాసీదాగా చేసుకున్నారు. రాష్ట్రంలో కూటమి అగ్రనేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఏడు నెలల పాలనా వైఫల్యాలు ఎక్కడ తన మెడకు చుట్టుకుంటాయోననే భయం కూటమి ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన రాజశేఖర్‌ను వెంటాడుతోంది. చంద్రబాబు అండ్‌ కో ఇచ్చిన హామీలు అమలైతే లబ్ధి పొందే అన్ని కేటగిరీల్లోను పట్టభద్రుల సంఖ్య గణనీయంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వంపై పెల్లుబుకుతోన్న ప్రజావ్యతిరేకత పట్టభద్రులను కచ్చితంగా ప్రభావితం చేస్తుందనే చర్చ కూటమి నేతల మధ్యే జరుగుతుండటం గమనార్హం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఊరూరా తిరిగి పట్టభద్రుల ఓట్లను జాయిన్‌ చేయించుకున్నా కూటమి సర్కార్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకత కొంప ముంచుతుందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

కాకినాడ జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లు

గత నెల 30న ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి అర్హులైన ఓటర్లు 3,15,261 మంది ఉన్నారని లెక్క తేల్చారు. అత్యధికంగా కాకినాడ జిల్లాలో 70,343 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో 4,664 మంది ఉన్నారు. కాగా, పెరిగిన ఓటర్లకు అనుగుణంగా ఐదు జిల్లాల్లో పోలింగ్‌ కేంద్రాలను కూడా పెంచారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 440 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు, పోలింగ్‌ స్టేషన్లు

జిల్లా పోలింగ్‌ కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

ఏఎస్‌ఆర్‌ 12 2,839 1,825 0 4,664

కోనసీమ 95 37,069 27,256 2 64,327

తూర్పుగోదావరి 82 36,714 26,725 2 63,441

ఏలూరు 62 24,895 17,699 8 42,602

కాకినాడ 96 42,437 27,899 7 70,343

పశ్చిమగోదావరి 93 39,780 30,103 1 69,884

మొత్తం 440 1,83,734 1,31,507 20 3,15,261

నియమావళి పాటించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు సహకరించాలి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అందరూ పాటించాలి.

– కె.వెట్రిసెల్వి, జిల్లా కలెక్టర్‌,

ఏలూరు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి

నోటిఫికేషన్‌ : ఫిబ్రవరి 3

నామినేషన్ల స్వీకరణకు

చివరి తేదీ : ఫిబ్రవరి 10

నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 11

నామినేషన్ల

ఉపసంహరణ : ఫిబ్రవరి 13

పోలింగ్‌ తేదీ : ఫిబ్రవరి 27

పోలింగ్‌ సమయం : ఉదయం 8 గంటల

నుంచి సాయంత్రం

4 గంటలు

ఓట్ల లెక్కింపు : మార్చి 03

పట్టభద్రుల ఎమ్మెల్సీ

ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

కూటమి గెలుపునకు చంద్ర‘గ్రహణం’

వాగ్దానాలు అమలు చేయని ‘బాబు’

వెంటాడుతోన్న ప్రజాగ్రహం

ఏడు నెలల పాలనా

వైఫల్యం కొంప ముంచనుందా?

ఆర్‌ఓగా ఏలూరు

జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏఆర్వోలుగా

జిల్లా రెవెన్యూ అధికారులు

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో

3,15,261 మంది ఓటర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
ఎన్నికల షెడ్యూల్‌1
1/1

ఎన్నికల షెడ్యూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement