ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి పుష్య అమావాస్య పర్వదినం సందర్భంగా బుధవారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. వనదుర్గ అమ్మవారి ఆలయంలో ఉదయం తొమ్మిది గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. అనంతరం 11–15 గంటలకు హోమగుండంలో హోమ ద్రవ్యాలను సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవారికి వేదపండితులు ఆశీస్సులు, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి నైవేద్యాలు నివేదించారు. వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకుడు వేణు వ్రత పురోహితులు కూచుమంచి ప్రసాద్, దేవులపల్లి ప్రకాష్ హోమం నిర్వహించారు. దేవస్థానం ఈఓ వీ సుబ్బారావు దంపతులతో బాటు 50 మంది భక్తులు రూ.750 టిక్కెట్‌తో ఈ హోమంలో పాల్గొన్నారు.
బ్రిడ్జి కోర్సు ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఐటీఐ రెండేళ్ల కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులను పాలిటెక్నిక్ డిప్లమా రెండవ ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు సిద్ధం చేయడానికి బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఎం.వేణుగోపాల వర్మ బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో, ఇతర వివరాలకు 87907 98431 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఈవీఎం గోదాము పరిశీలన
కాకినాడ సిటీ: కాకినాడ కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదామును బుధవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల శాఖల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎం గోదామును పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టర్ వెంట కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి. జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ ఎం.జగన్నాథం, ఇతర అధికారులు ఉన్నారు.
కలెక్టర్‌తో ఏఎస్పీ భేటీ
కాకినాడ సిటీ: కాకినాడ జిల్లా ఏఎస్పీగా నియమితులైన పాటిల్ దేవరాజ్ మనీష్ బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు అంశాలు ఆయన కలెక్టర్‌తో చర్చించారు.
1న పింఛన్ల పంపిణీ
కాకినాడ సిటీ: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద ఫిబ్రవరి ఒకటో తేదీన కాకినాడ జిల్లాలో 2,72,437 మంది పింఛన్‌దారులకు రూ.166.68 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం తెలిపారు. రెండు నెలలుగా పింఛన్ సొమ్ము తీసుకోకుండా ఉన్న వారికి ఆ నెలల పింఛన్ కూడా అందిస్తారన్నారు. పింఛను బట్వాడా ఇంటి వద్ద కాకుండా వేరొక చోటకు రమ్మని చెప్పినా, పింఛనుదారులను డబ్బు అడిగినా, పింఛను బట్వాడా చేసే అధికారి ప్రవర్తన సరిగా లేకపోయినా వివరాలను 73311 10544 నంబర్‌కు ఫోన్ ద్వారా గాని, ఫొటో రూపంలో వాట్సాప్‌కు గాని తెలియజేయవచ్చని కలెక్టర్ షణ్మోహన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment