
సత్యదేవునికి జన్మ నక్షత్ర పూజలు
అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా బుధవారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చక స్వాములు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్‌లకు, శివ లింగానికి పండితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్లరసాలతో మహాన్యాశ పూర్వక అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం సుగంధ భరిత పుష్పాలతో, స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.
యాగశాలలో ఘనంగా ఆయుష్య హోమం
స్వామివారి యాగశాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు అయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయుష్య హోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి, యనమండ్ర శర్మ ఘనపాఠి, అర్చకులు నిట్టల కామేశ్వరరావు, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి, తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సత్యదేవుని దర్శించిన 20 వేల మంది భక్తులు
బుధవారం సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు గోశాలలో సప్తగోవులకు ప్రదక్షణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు వేయి నిర్వహించగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజనం పెట్టారు.
నేడు స్వామివారి నిజరూప దర్శనం
గురువారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరులు ఏ ఆభరణాలు ధరించకుండా (మూల విరాట్‌లుగా) నిజరూపులో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment