బ్యాలెట్‌ పేపర్‌ నుంచి.. ఎం–2 ఈవీఎంల దాకా..! | - | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ పేపర్‌ నుంచి.. ఎం–2 ఈవీఎంల దాకా..!

Published Sun, Nov 19 2023 1:20 AM | Last Updated on Sun, Nov 19 2023 12:10 PM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: దొంగ ఓట్లను నియంత్రించడానికి నాటి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ టీఎన్‌ శేషణ్‌ విశేషంగా కృషి చేశారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల్లో బ్యాలెట్‌ పేపర్‌కు బదులు ఈవీఎంల వినియోగం ప్రధానమైనది. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులతో ముద్రించిన బ్యాలెట్‌ పేపర్‌ను మొదట్లో ఉపయోగించే వారు. ఓటరు తాను ఓటు వేయాలనుకునే అభ్యర్థి పార్టీ గుర్తుపై స్టాంప్‌ వేసి బ్యాలెట్‌ పేపర్‌ను బాక్సులో వేసే వారు.

అనంతరం ఎన్నికల అధికారులు బ్యాలెట్‌ పేపర్లను లెక్కించి విజేతలను ప్రకటించేవారు. దీంతో ఓట్ల లెక్కింపు కష్టంగా మారేది. ఈ సమస్యను అధిగమించేందుకు టీఎన్‌ శేషణ్‌ హయాంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎ)తో ఓటు వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. మొదట్లో ఎం–1 టైప్‌ ఈవీఎంలు రాగా, 2006 తర్వాత ఎం–2 ఈవీఎంలు వచ్చాయి. 2013 తర్వాత ఎం–3 ఈవీఎంలు వాడకంలోకి వచ్చాయి. ఇప్పుడు ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందా లేదా అన్నది తెలుసుకోడానికి ఓటర్‌ వెరిఫికేబుల్‌ ప్యాట్‌ను ప్రవేశపెట్టారు.

16 మందికి మించితే బ్యాలెట్‌..
ఈవీఎంలను ఉపయోగించే మొదటి రోజుల్లో 16 మంది అభ్యర్థులకు మించితే బ్యాలెట్‌ పేపర్‌ను వాడేవారు. నూతనంగా ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పుడు ఎం–1 టైప్‌ ఈవీఎంలు కావడంతో ఓ కంట్రోల్‌ యూనిట్‌ ద్వారా ఒక బ్యాలెట్‌ యూనిట్‌కే కనెక్షన్‌ ఇవ్వగలిగేవారు. ఒక ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తులే వచ్చేవి. అంతకన్నా ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేవారు. 2006 తర్వాత ఎం–2 టైప్‌ ఈవీఎంలు వచ్చాయి.

వీటికి ఒక కంట్రోల్‌ యూనిట్‌కు నాలుగు ఈవీఎంలు కనెక్షన్‌ ఇవ్వవచ్చు. దీంతో ఒక నియోజకవర్గంలో 64 మంది పోటీ చేసినా ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ నిర్వహణకు వెసులుబాటు కలిగింది. 2013 తర్వాత ఎం–3 ఈవీఎంలు అందుబాటులోకి రావడంతో ఒక కంట్రోల్‌ యూనిట్‌కు 24 బ్యాలెట్‌ యూనిట్ల కనెక్షన్లు ఇవ్వొచ్చు. దీంతో 384 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ఈవీఎంలతోనే ఓటింగ్‌ సాధ్యమవడానికి అవకాశం కలిగింది.

ఈవీఎంల సామర్థ్యం, పనితీరును ఎంత మెరుగుపరిచినా తాను వేసిన గుర్తుకు ఓటు పడిందో లేదోనన్న అనుమానం ఇటు ఓటర్లలో అటు రాజకీయ పార్టీల నాయకుల్లోనూ ఉండేది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తేవి. అలాంటి ఆరోపణలు, అనుమానాలకు ఆస్కారం లేకుండా నూతనంగా వీవా ప్యాట్‌లను ప్రవేశపెట్టారు. దీంతో ఓటరు తాను వేసిన గుర్తుకు ఓటు పడిందా లేదా అన్నది వీవీ ప్యాట్‌లో చూసి నిర్ధారించుకొనే అవకాశం కలిగింది. ఓటరు ఓటు వేసిన వెంటనే వీవీ ప్యాట్‌లో ఏడు సెకండ్ల పాటు అతను ఓటు వేసిన పార్టీ గుర్తు కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి: 'ఈవీఎం' విశేషాల గురించి.. మీకు పూర్తిగా తెలుసా..!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement