
సాక్షి, కామారెడ్డి: ఇద్దరు ముఖ్య నేతలను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెడుతున్నారు. ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కామారెడ్డిలో ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని ఒకేసారి ఓడించడం ద్వారా చరిత్ర సృష్టించిన కేవీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు సామాజిక మాద్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కొందరు ఫోన్ చేసి జెయింట్ కిల్లర్ అంటూ అభినందించారు.
కేవీఆర్ నామినేషన్ వేయక ముందు నిర్వహించిన బైక్‌ర్యాలీ, సభల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆయన ఫాలోయింగ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కేవీఆర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునేలా ప్రయత్నిస్తానని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మంది ఎమ్మెల్యేలు గెలవకపోవడంతో మంత్రిని చేసే అవకాశం లేకుండాపోయింది.
అయితే బీజేపీ శాసనసభా పక్షంలో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరు రాజకీయ ఉద్ధండులను ఓడించిన వెంకటరమణారెడ్డికి కీలకమైన పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. రాజకీయాల మీద, వ్యవస్థల మీద అవగాహన ఉన్న వెంకటరమణారెడ్డికి అవకాశం ఇస్తే ఆయన అసెంబ్లీలో ఆయా అంశాల మీద తన గళాన్ని గట్టిగా వినిపించగలరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న విషయమై శ్రేణుల్లో చర్చ సాగుతోంది.