
కరీంనగర్ అర్బన్: రైతుబంధు ఇక అందరికీ అందనుంది. పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు, రిజిస్ట్రేషన్ జరిగిన తదుపరి జారీ అయ్యే భూ యాజమాన్య హక్కుపత్రం ఉన్న రైతులు పెట్టుబడి సాయం పొందనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల క్రమంలో కట్ ఆఫ్ తేదీని పొడిగించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
తొలుత గత డిసెంబర్ 20 నాటికి పాసు పుస్తకా లు పొందినవారు మాత్రమే రైతుబంధుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కట్ ఆఫ్ తేదీని ఈ నెల 16గా నిర్ణయించడంతో కొత్తగా పాసుపుస్తకాలు పొందిన రైతులందరికీ పెట్టుబడి సాయం(రైతుబంధు) అందనుంది. ఈ నెల 26 నుంచి పెట్టుబడి సాయం రైతుల ఖాతాలకు చేరనుండగా యుద్ధప్రతిపాదికన రైతుల వివరాలను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఏ ఒక్క రైతు మిగలకుండా వారి వివరాలను సైట్‌లో అప్‌లోడ్ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ ఏఈవోలను ఆదేశించారు. కట్ ఆఫ్ తేదీ ప్రామాణికంగా తీసుకుని రైతుల పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాసుపుస్తకం సేకరిస్తున్నారు. ప్రభుత్వ తాజా ప్రకటన క్రమంలో జిల్లాకు రూ.183.03కోట్ల పెట్టుబడి సాయం రానుంది. తొలుత సన్న, చిన్న కారు రైతులకు, తదుపరి పెద్ద రైతులకు సాయం అందనుంది.
పెరుగుతున్న సాగు విస్తీర్ణం
గత సంవత్సరం వరకు వర్షాలు సమృద్ధిగా కురియడంతో పాటు ప్రాజెక్టులు పూర్తవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. పడావు ఉన్న భూములు ప్రస్తుతం పచ్చని పైరుగా రూపాంతరం చెందాయి. 2016 వానాకాలం సీజన్‌లో 2,53,463 ఎకరాల్లో పంటలు సాగవగా 2022లో 3,40,390 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అపుడు వరి 81,755 ఎకరాల్లో సాగవగా ప్రస్తుతం 2,72,500ల ఎకరాలకు చేరింది. భూగర్బజలాలు పెరగడం, కాలువల ద్వారా నీరందుతుండటంతో వరి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక అపుడు పత్తి 1,17,476 ఎకరాల్లో సాగవగా ప్రస్తుతం 48వేల ఎకరాలకు పరిమితమైంది. మొక్కజొన్న 46,068 ఎకరాల్లో సాగవగా ప్రస్తుతం 4,500ల ఎకరాలకు మాత్రమే పరిమితమవడం గమనార్హం. తృణధాన్యాల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
మొత్తం గ్రామాలు: 313 ఏఈవో క్లస్టర్లు: 76 జిల్లాలో సాగు భూమి: 3,39,050ఎకరాలు తాజాగా రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతులు: 2,00,075 వానాకాలం అందనున్న సాయం: రూ.182.03కోట్లు ఏఈవోలు అప్‌డేట్ చేసిన రైతుల సంఖ్య: 1,81,445 ఇంకా యాప్‌లో నమోదు చేయాల్సింది: 18,630
Comments
Please login to add a commentAdd a comment