కోలారు : కోలారు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. పరువు కోసం ఓ తండ్రే కన్న కూతురిని హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. కోలారు తాలూకా తొట్లి గ్రామానికి చెందిన రమ్య (19) హత్యకు గురైన యువతి. వివరాలు... గ్రామానికి చెందిన వెంకటేష్‌గౌడ కుమార్తె రమ్య ఇంటర్ చదువుతోంది. రమ్య ఇదే గ్రామానికి చెందిన ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోంది.
విషయం ఇంట్లో తెలిసి తండ్రి వెంకటేషగౌడ మందలించాడు. అయినా రమ్య వినలేదు. దీంతో ఆగ్రహించిన తండ్రి వెంకటేషగౌడ ఈనెల 25వ తేదీ రాత్రి రమ్యను హత్య చేసి తెల్లవారకనే తన సంబంధీకులతో కలిసి అంతిమ సంస్కారాలు కూడా ముగించాడు.
చివరికి గుట్టు రట్టయ్యింది..
గ్రామంలో రమ్య మరణం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పలువురు పలు రకాలుగా మాట్లాడుకోవడం చివరికి విషయం పోలీసులకు చేరడంతో కోలారు రూరల్ పోలీసులు రమ్య తండ్రి వెంకటేష్‌గౌడను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు.
పోలీసుల విచారణలో రమ్యను తానే హత్య చేసిన విషయం బయట పడడంతో రూరల్ పోలీసులు తహసీల్దార్ హర్షవర్ధన్ సమక్షంలో రమ్య మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయడానికి నిర్ణయించారు. తహసీల్దార్ హర్షవర్ధన్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. రూరల్ పోలీసులు రమ్య తండ్రి వెంకటేష్‌గౌడ అతని సమీప బంధువు చౌడగౌడను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment