
ఓ నాన్నా.. అనాథవేనా?
దొడ్డబళ్లాపురం: కుటుంబ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఎన్నో కష్టానష్టాలకు ఓర్చి అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వయసు మీద పడగానే వదిలించుకోవాలని చూసే కొడుకులు ఎక్కువయ్యారు. బెళగావిలో అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని కన్న కొడుకు ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు. తండ్రి చనిపోయి అనాథ శవమయ్యాడు. బిమ్స్ ఆస్పత్రిలో వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న సతీశ్వర్ అనే వృద్ధున్ని అతని కుమారుడు 15 రోజుల క్రితం బెళగావి జిల్లా ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయాడు. అప్పటినుంచి వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు, మార్చి 31న ఆయన మరణించాడు. వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కుమారుని కోసం శోధించారు. అయితే జాడ దొరకలేదు.
కుమార్తెచే అంత్యక్రియలు
చివరకు గోవాలో జీవిస్తున్న కుమార్తెను తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపించారు. కుమార్తె చెప్పిన ప్రకారం ఆమె సహోదరుడు కొన్ని రోజుల క్రితం గోవా నుంచి తండ్రిని తీసుకుని వచ్చేశాడు. తానే చూసుకుంటానని చెప్పి ఇలా చేసాడని ఆమె వాపోయింది. ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలియదని చెప్పింది. పిల్లలు వృద్ధ తల్లిదండ్రులను బెళగావి బిమ్స్‌లో అనారోగ్యమని చేర్పించి పత్తా లేకుండా పోతున్నారని, ఇలాంటి పిల్లలకు ఇచ్చిన ఆస్తిపాస్తులను రద్దు చేయాలని వైద్యవిద్యా మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ ఇటీవల డిమాండ్ చేయడం తెలిసిందే.
తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి పరారైన తనయుడు
మృతిచెందిన వృద్ధుడు

ఓ నాన్నా.. అనాథవేనా?