సమస్యలు చెప్పుకునేదెలా? | - | Sakshi
Sakshi News home page

సమస్యలు చెప్పుకునేదెలా?

Published Tue, Nov 26 2024 12:43 AM | Last Updated on Tue, Nov 26 2024 12:43 AM

సమస్య

సమస్యలు చెప్పుకునేదెలా?

● ఎస్సీ గురుకులాల్లో కానరాని కాయిన్‌ బాక్స్‌లు ● అధికారుల దృష్టికి వెళ్లని విద్యార్థుల సమస్యలు ● పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్న వైనం.. ● పట్టించుకోని గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు

బెల్లంపల్లి:ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఎప్పటికప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల జిల్లాల పరిధిలో ఉన్న 17 గురుకులాల్లో సమస్యలు తిష్టవేశాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ చుట్టపు చూపుగా మారింది. దీంతో విద్యార్థులు తమ సమస్యలను నేరుగా గురుకుల విద్యాలయాల కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లేందుకు కాయిన్‌ బాక్స్‌లను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉన్నా అమలు కావడం లేదు. ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో గురుకులాల్లో సమస్యలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయనే విమర్శలు తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

కొన్ని గురుకులాల్లో మాత్రమే..

గురుకులాల్లో కాయిన్‌ బాక్స్‌ల ఏర్పాటు కలగా మారింది. పైలెట్‌ ప్రాజెక్టు కింద కొన్ని గురుకులాల్లో కాయిన్‌ బాక్స్‌లను బిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రక్రియ అంతటా విస్తరించలేదు. హైదరాబాద్‌ పరిసర ప్రాంత గురుకులాల్లో మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీటి పనితీరు ఏ విధంగా ఉందో, విద్యార్థులు ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటున్నారో తెలియదు. కానీ ఇతర గురుకులాల్లో కాయిన్‌ బాక్స్‌లు ఏర్పాటు చేయడంలో ఉన్నతాధికారులు మీన మేషాలు లెక్కిస్తుండటంతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. మరోవైపు సలహాలు, సూచనల బాక్స్‌ల ఏర్పాటు అతీగతి లేకుండా పోయింది.

మచ్చుకు కొన్ని సమస్యలు..

● విద్యార్థుల డైట్‌, కాస్మెటిక్‌ చార్జీలను ప్రభుత్వం ఇటీవల పెంచినప్పటికీ ఇంకా కొన్ని గురుకులాల్లో పూర్తిస్థాయిలో మెనూ పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.

● మరుగుదొడ్లు , మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం లేదు. దీంతో విద్యార్థులు దుర్గంధంతో సతమతమవుతున్నారు.

● రోజువారీగా డార్మెటరీల్లో చెత్తా చెదారం తొలగించడంలేదు. బెడ్స్‌ విరిగిపోయి ఉండటంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఫ్యాన్లు, లైట్ల సమస్యలు కూడా ఉన్నాయి.

● శీతాకాలంలో విద్యార్థులు చన్నీళ్ల స్నానం చేస్తున్నారు. సోలార్‌ వాటర్‌ హీటర్లు బిగించాల్సి ఉండగా ఏళ్ల తరబడి నుంచి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

● ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో విద్యార్థుల్లోనూ అవలక్షణాలు అలవడుతున్నాయి. క్రమశిక్షణ రాహిత్యం పెరుగుతోంది.

● విధుల్లో కొందరు ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదు. చిత్తశుద్ధితో బోధన చేయకుండా ‘మమ’ అనిపిస్తున్నారు.

● ప్రైవేట్‌ విద్యార్థులకు సరిసమానంగా గురుకుల విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడలేక పోతున్నారు. తెలుగులో మాట్లాడటానికి మొగ్గు చూపుతున్నారు.

● కొన్నిచోట్ల దోబీఘాట్లు నిర్మించకపోగా ఉన్నచోట్ల వినియోగించకపోవడంతో విద్యార్థుల దుస్తులు శుభ్రతకు నోచుకోవడం లేదు.

● క్రీడాసామగ్రి, క్రీడాదుస్తులు సరఫరా చేసినా సక్రమంగా వినియోగించడం లేదు. దీంతో విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపడం లేదు.

● పేరెంట్స్‌ హాల్‌ నిర్మించాల్సి ఉన్నా శ్రద్ధ చూపడంలేదు.

● ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో ఏర్పాటు చేసిన సీవోఈలో అధ్యాపకుల పోస్టుల మంజూరు జరగడం లేదు. వీటి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ గురుకులాలు

ఆదిలాబాద్‌ ఆదిలాబాద్‌, బోథ్‌, ఇచ్చోడ

కుమురంభీం సిర్పూర్‌(టి)–(జీ), రెబ్బెన, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి)–(బీ)

మంచిర్యాల మంచిర్యాల, కోటపల్లి, కాసిపేట (బెల్లంపల్లి), బెల్లంపల్లి (సీవోఈ), జైపూర్‌,

మందమర్రి, చెన్నూర్‌, బెల్లంపల్లి(జీ), లక్సెట్టిపేట

కొన్నింటిలో ఏర్పాటు చేశారు

నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శి పైలెట్‌ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురుకులాల్లో కాయిన్‌ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. వీటి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని మిగతా గురుకులాల్లోనూ ఏర్పాటు చేయాలనే తలంపులో ఉన్నారు. కాళేశ్వరం జోన్‌లో ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

– అరుణకుమారి,

జోనల్‌ అధికారి, కాళేశ్వరం జోన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
సమస్యలు చెప్పుకునేదెలా?1
1/1

సమస్యలు చెప్పుకునేదెలా?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement