● విడుదలైన షెడ్యూల్‌ ● పట్టభద్రులు, టీచర్ల స్థానాలకు ఎన్నిక ● మద్దతు కోసం ఓట్ల వేటలో అభ్యర్థులు | - | Sakshi
Sakshi News home page

● విడుదలైన షెడ్యూల్‌ ● పట్టభద్రులు, టీచర్ల స్థానాలకు ఎన్నిక ● మద్దతు కోసం ఓట్ల వేటలో అభ్యర్థులు

Published Thu, Jan 30 2025 12:27 AM | Last Updated on Thu, Jan 30 2025 12:27 AM

-

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. మెదక్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో ఎన్ని కల నగారా మోగింది. ఇప్పటికే బరిలో నిలిచే అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలతో ఓటర్లకు దగ్గరవుతున్నారు. సమావేశాలు, సదస్సులు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి హామీలు గుప్పిస్తున్నారు. సొంతంగా మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి విస్తృతంగా ఉండడంతో ఇప్పటికే ఓ మారు చుట్టేసి వచ్చారు. ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతున్నారు.

పోటీలో అనేక మంది

ఉపాధ్యాయ, విద్యారంగ ప్రముఖులు, ప్రభుత్వ ఉ ద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులు, ప్రొఫెసర్లు, పలు సంఘాల నాయకులు పోటీలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటివరకు అధికారికంగా బీజేపీ అభ్యర్థిగా పట్టభద్రుల స్థానం నుంచి సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకుడు అంజిరెడ్డిని ప్రకటించగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్క కొమురయ్యను ప్రకటించింది. మిగతా ప్రధాన పార్టీలేవి ఇంకా అభ్యర్థుల పేర్లు అధికారికంగా వెల్లడించలేదు. మంచిర్యాల జిల్లా నుంచి ఉపాధ్యాయ సంఘాల నాయకుడు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, తెలంగాణ చాప్టర్‌ మాజీ అధ్యక్షుడు బీఎన్‌రావు, నిజామాబాద్‌, మెదక్‌, సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి పలువురు పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరు ఆయా పార్టీల నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్నా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. స్వతంత్రంగా పలువురు యువకులు బరిలో ఉండేందుకు ఆరాట పడుతున్నారు.

అమల్లోకి కోడ్‌

ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పదవీ కాలం మార్చి 29న పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఆలోపు ఎన్నిక నిర్వహించేందుకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఓటింగ్‌, ఓట్ల లెక్కింపుపై షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఎన్నికల కోడ్‌ తక్షణం అమలు కానుంది. ఫలితంగా సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్‌ పడనుంది. ఇప్పటికే ఓటరు జాబితా సిద్ధం కాగా, ఎన్నికల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం ఆ మేరకు అంతా సిద్ధం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని ఆయా జిల్లాల కలెక్టర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

షెడ్యూల్‌ ఇలా..

ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌

ఫిబ్రవరి 3నుంచి 10వరకు

నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 27న పోలింగ్‌

మార్చి 3న ఓట్ల లెక్కింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement