మండలానికో ‘మోడల్‌’ గృహం | - | Sakshi
Sakshi News home page

మండలానికో ‘మోడల్‌’ గృహం

Published Fri, Jan 31 2025 2:05 AM | Last Updated on Fri, Jan 31 2025 2:05 AM

మండలానికో ‘మోడల్‌’ గృహం

మండలానికో ‘మోడల్‌’ గృహం

● మండల కేంద్రాల్లో నిర్మాణాలకు శ్రీకారం ● ఇప్పటికే కౌటాల, సిర్పూర్‌(టి), వాంకిడిలో భూమిపూజ ● రెండు నెలల్లో పూర్తిచేసేందుకు అధికారుల కసరత్తు

పెంచికల్‌పేట్‌(సిర్పూర్‌): ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 335 గ్రామ పంచాయితీలతో పాటు ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో లబ్ధిదారులను ఎంపిక కోసం నాలుగు రోజులపాటు అధికారులు వార్డు, గ్రామసభలు నిర్వహించారు. ఇప్పటికే మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి జనవరి 26న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అర్హుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంటున్న నేపథ్యంలో లబ్ధిదారులకు గృహ నిర్మాణంపై అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో మోడల్‌ ఇందిరమ్మ గృహాలు నిర్మించనున్నారు. మండల కేంద్రాల్లోని ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఆవరణ, ప్రభుత్వ భూముల్లో రూ.5లక్షల నిధులతో గృహ నిర్మాణ శాఖ, ఇంజినీరింగ్‌ అధికారులు పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లాలోని కౌటాల, సిర్పూర్‌(టి) మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌, వాంకిడి మండల కేంద్రంలో ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మోడల్‌ గృహ నిర్మాణ పనులకు ఇటీవల భూమిపూజ చేశారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాలకు ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసింది. ప్రజాపాలన, ప్రత్యేక గ్రామ సభల్లో వేలాది దరఖాస్తులు వచ్చాయి. అధికారులు ఇప్పటికే నిర్వహించిన గ్రామసభ, వార్డు సభల్లో అర్హుల జాబితాను చదివి వినిపించి కొత్త దరఖాస్తులు సైతం స్వీక రించారు. ప్రజాపాలన, ప్రత్యేక గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 85,059 దరఖాస్తులు వచ్చాయి.

400 చదరపు అడుగుల విస్తీర్ణం..

ఇందిరమ్మ ఇళ్లను రూ.5లక్షల వ్యయంతో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడానికి గృహనిర్మాణ శాఖ అధికారులు నమూనా తయారు చేశారు. హాలు సైజ్‌ 9x10 చదరపు అడుగులు, వంట గది 6.9x10 చదరపు అడుగులు, బెడ్‌రూం అటాచ్డ్‌ బాత్‌రూం, వాష్‌ ఏరియాతో కలిపి 12.5x10.5 చదరపు అడుగులతో నమూనా రూపొందించారు. ఇంటి నిర్మాణంలో ఐదు తలుపులు, నాలుగు కిటికీలు, రెండు వెంటిలేటర్లు ఉంటాయి. వీటితోపాటు ఇంటి లోపల, బయట టైల్స్‌ సైతం వేయడానికి ఏర్పాట్లు చేశారు.

అవగాహన కోసమే..

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ మండల కేంద్రంలో మోడల్‌ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం. రూ.5 లక్షల వ్యయంతో నిర్మించే ఇంటిలో అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే మూడు మండలాల్లో గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించాం.

– వేణుగోపాల్‌, డీఈ, గృహ నిర్మాణశాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement