గుస్సాడీ రారాజు కనకరాజు
జైనూర్(ఆసిఫాబాద్): పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు గుస్సాడీ రారాజు అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో గురువారం నిర్వహించిన కనక రాజు సంతాప సభకు ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కనక రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ దండారీ ఉత్సవాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. మార్లవాయితోపాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి చాటిన కనక రాజును ఆదివాసీ సమాజం ఎప్పటికీ మరువదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతిలో రూ.20 లక్షలను గుస్సాడీ శిక్షణ కేంద్రానికి కేటాయించి భావితరాల కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అనంతరం కనక రాజు సతీమణులు భీంబాయి, పార్వతీబాయిలను సత్కరించారు. కార్యక్రమంలో జీసీసీ రాష్ట్ర చైర్మన్ తిరుపతి, నాయకులు ఆత్రం సుగుణ, మల్లేశ్, విశ్వనాథ్, అబ్దుల్ ముఖిద్, కనక ప్రతిభ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment