టీడీపీ నాయకుడి దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుడి దాష్టీకం

Published Thu, May 25 2023 9:10 AM | Last Updated on Thu, May 25 2023 11:17 AM

రాష్ట్ర మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో నిందితుడు కుంచే నాని (ఫైల్‌)   - Sakshi

రాష్ట్ర మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో నిందితుడు కుంచే నాని (ఫైల్‌)

కోనేరుసెంటర్‌ (మచిలీపట్నం): కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడైన కుంచే నానిపై కిడ్నాప్‌ కేసు నమోదైంది. వడ్డీ చెల్లించడం లేదంటూ అప్పు తీసుకున్న వ్యక్తిని బంధించగా.. తప్పించుకున్న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడైన కుంచే నాని వద్ద వర్రేగూడెంకు చెందిన ఎస్‌కే అమీన్‌ అలియాస్‌ మున్నా కుటుంబ సభ్యులు ఆర్థిక అవసరాల నిమిత్తం 2014లో రూ.4 లక్షల అప్పు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆర్థిక పరిస్థితులు అంతగా బాగోకపోవడంతో అమీన్‌ కుటుంబం కొన్ని నెలలుగా వడ్డీ చెలించడం లేదు.

దీంతో ఆగ్రహానికి గురైన కుంచే నాని.. తాతా సురేష్‌ అనే వ్యక్తి సహాయంతో బుధవారం అమీన్‌ ఇంటికి వెళ్లి అందరూ చూస్తుండగా అతన్ని దుర్భాషలాడి బలవంతంగా బైక్‌ ఎక్కించుకొని బైపాస్‌రోడ్డులోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో అమీన్‌ను బంధించి, అప్పు కట్టే వరకు వదిలేది లేదంటూ భీష్మించాడు. అతనిపై కర్రలతో దాడి చేశారు. జేబులో నగదు బలవంతంగా తీసుకుని సుమారు రెండు గంటల పాటు హింసించి వదిలారు. అక్కడి నుంచి బయట పడిన అమీన్‌ నేరుగా ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కుంచే నాని, తాతా సురేష్‌పై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కుంచే నాని, తాతా సురేష్‌పై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

మొదటి నుంచీ ఇదే తీరు..
గత ప్రభుత్వంలో వడ్డీ వ్యాపారం పేరుతో అనేక మందిని హింసించిన కుంచె నాని.. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తూ పేదల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. వడ్డీలు కట్టలేని వారిని బంధించి హింసిస్తున్నారు. ఇప్పుడు అమీన్‌ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.

పరారీలో కుంచే..
బాధితుడి ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో కుంచే నాని అతని అనుచరుడు సురేష్‌లపై కిడ్నాప్‌ కేసు నమోదు కాగా విషయం తెలుసుకున్న ఇరువురు పోలీసుల కంటపడకుండా తిరుగుతున్నారు. అయితే పోలీసులు ఇరువురిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మూడు బృందాలుగా ఏర్పడి కుంచే నాని, సురేష్‌ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement