ఘటనా స్థలిలో పడి ఉన్న రియాజ్
నడకుదురు(చల్లపల్లి): గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు గుజరాత్ రాష్ట్రం సూరత్ నుంచి వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పెద ఓగిరాలకు చెందిన మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తి సూరత్‌లో కొన్నేళ్లుగా మెకానికల్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. తాజాగా గ్రూప్–2కు దరఖాస్తు చేసిన రియాజ్ ఆదివారం చల్లపల్లిలోని పరీక్షా కేంద్రానికి వచ్చేందుకు శనివారం విజయవాడ చేరుకున్నాడు. ఆటోనగర్ డొంకరోడ్డులో తన బంధువుల ఇంట బస చేసి ఉదయానే స్థానికుల ద్విచక్ర వాహనంపై చల్లపల్లికి కృష్ణానది కరకట్ట మీదుగా బయలుదేరి వచ్చాడు. రియాజ్ చల్లపల్లి మండలం నడకుదురు దాటి రాముడుపాలెం అడ్డ రోడ్డు సమీపంలో ప్రయాణిస్తూ ఉండగా, ఎదురుగా వచ్చిన భారీ టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదంలో రియాజ్ తలకు తీవ్ర గాయాలు కావటంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. మోపిదేవి 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రియాజ్ విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. రియాజ్‌కు వివాహమై, భార్య, కుమార్తె ఉన్నారు. చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment