సమష్టిగా ప్రగతి సాధిద్దాం
జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ప్రజల విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను సమష్టి భాగస్వామ్యంతో సత్వరం పూర్తి చేసేందుకు అవసరమైన డీపీఆర్‌లను త్వరితగతిన సిద్ధం చేయాలని, ఇప్పటికే చేపట్టిన పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కోరారు. రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు బుధవారం జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్, కలెక్టర్ లక్ష్మీశ, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. రైల్వేతో ముడిపడిన ఇంజినీరింగ్, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎస్టేట్ సెక్షన్ల అంశాలపై సమావేశంలో చర్చించారు. విజయవాడను ఇబ్బంది పెట్టిన వరదలు పునరావృతం కాకుండా రైల్వే భాగస్వామ్యంతో చేపట్టాల్సిన పనులు నిరాటంకంగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు.
రైల్వే హబ్‌గా విజయవాడ..
పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థల అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్‌లను వెంటనే సిద్ధం చేసి, అనుమతులు సాధించేలా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్రంతో మాట్లాడి విజయవాడ నగరాన్ని రైల్వే హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా రైల్వేతో ముడిపడిన ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
స్పష్టమైన కార్యాచరణతో..
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్మాణాలకు అనువైన వేసవిలో వివిధ అభివృద్ధి పనుల పూర్తికి స్పష్టమైన కార్యాచరణతో, ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, రైల్వే అధికారుల సమన్వయంతో ప్రజావసరాలను తీర్చే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి పనులు పూర్తిచేసేందుకు కృషి చేస్తామన్నారు.
సమన్వయంతో మెరుగైన ఫలితాలు..
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పనుల పూర్తికి ఇలాంటి సమన్వయ సమావేశాలతో మెరుగైన ఫలితాలు ఉంటాయని డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ అన్నారు. వచ్చే రెండేళ్ల సమయం చాలా కీలకమైందని, సమష్టి కృషితో పనుల సత్వర పూర్తితో రాష్ట్ర అభివద్ధికి కృషి చేద్దామన్నారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసిహం, సీనియర్ డివిజనల్ ఇంజినీర్ (సమన్వయం) ఎస్.వరుణ్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment